నిరుపేదలకు బీమా సౌకర్యం కల్పించే వైఎస్ఆర్ బీమా పథకం అందని ద్రాక్షలా మారింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఉన్న చంద్రన్న బీమా పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన.. వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల మందిని ఈ బీమా పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రతి జిల్లాలో సగటున 20 లక్షల మందికి తగ్గకుండా పేదలను ఈ పథకంలో చేర్చారు. అయితే పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీలు ముందుకు రావడం లేదు. దీంతో లక్షలాది క్లెయిమ్ లు పెండింగ్ లో పెట్టేశారు.
పథకం ప్రయోజనాలు ఘనం
వైఎస్ఆర్ బీమా పథకంలో చేరిన వారిలో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారు సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు, పూర్తి అంగవైకల్యం పాలైతే రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలతో పాటు ఇద్దరు పిల్లలకు ఏటా రూ.1200 ఉపకార వేతకం కూడా చెల్లించాలి. ఇక 51 నుంచి 60 సంవత్సరాల వయసు వారయితే సహజ మరణానికి రూ.30 వేలు, ప్రమాదం, పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.5 లక్షలతో పాటు ఇద్దరు పిల్లలకు ఏటా రూ.1200 ఉపకార వేతనం చెల్లించాలి. 51 నుంచి 69 వయసు వారు మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.3 లక్షల సాయం అందిస్తారు.
లక్షల్లో క్లెయిమ్ లు నిలిపివేత
ఏటా ఈ బీమా కింద 2 లక్షల మంది క్లెయిమ్ లు పొందుతూ ఉంటారు. సహజమరణాలు, ప్రమాదాలు కవరేజీ ఉండటంతో ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ఉంటారు. అయితే ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో బీమా కంపెనీలు క్లెయిమ్ లు నిలిపివేశాయని తెలుస్తోంది. ఇప్పటికే లక్షకుపైగా క్లెయిమ్ లు పెండింగ్ లో పెట్టేశారు. ప్రతి జిల్లాలో సగటున 9 వేల క్లెయిమ్ లు ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. బాధితులు మండల కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు.
ఇది కూడా పంటల బీమాలాగే చేశారా?
పంటల బీమా మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం రైతులను మోసం చేసింది. బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించకపోవడంతో కంపెనీలు పంటల నష్ట పరిహారం నిలిపివేశాయి. ప్రభుత్వం అరకొరగా ఇచ్చే పరిహారం ఒక్కో రైతుకు రూ.2 వేలు కూడా అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక వైఎస్ఆర్ బీమా పథకం కింద కూడా బీమా కంపెనీలకు ప్రభుత్వం ఏటా ప్రీమియం చెల్లిస్తేనే వారు బాధితులకు క్లెయిమ్ లు చెల్లిస్తారు. ప్రభుత్వం బీమా సొమ్ము చెల్లించకుండా నిలిపివేయడం వల్లే లక్షకు పైగా క్లెయిమ్ లు నిలిచిపోయాయని తెలుస్తోంది. ఇప్పటికైనా పేదలకు అందాల్సిన బీమా పరిహారం వెంటనే చెల్లించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.










