హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం లాంటి విధ్వంసక కార్యక్రమాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఒక క్రిస్టియన్ పాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సదరు పాస్టర్ పేరు ప్రవీణ్ చక్రవర్తి. కాకినాడ కేంద్రం క్రిస్టియన్ మిషనరీ కార్యకలాపాలు నడుపుతూ క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు కూడా నిర్వహిస్తున్న వ్యక్తి. నిజానికి 2019లో ప్రవీణ్ చక్రవర్తి ఒక వీడియో లో చెప్పిన మాటలను ఆధారం చేసుకుని, మతకలహాలు, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అతని మాటలు ఉన్నాయనే ఆరోపణకు సంబంధించి.. వివిధ సెక్షన్ల నమోదైన కేసులతో అతడిని అరెస్టు చేయడం జరిగింది. అంతే తప్ప.. ఇప్పుడు రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం కేసులతో అతడికి సంబంధం ఉన్నదని కాదు! అయితే.. ఆ వీడియోలో ఉన్న మాటలను బట్టి.. ఈ వ్యవహారాల వెనుక అతడి హస్తం ఉండవచ్చుననే దిశగా ప్రజల్లో అనుమానాలున్నాయి. పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అతడి అరెస్టు జరిగి సుమారు వారం రోజులు అవుతంది. ఇక వర్తమానంలోకి వస్తే..
ప్రవీణ్ చక్రవర్తి భార్య డాక్టర్ రేష్మ తాజాగా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను ఎక్కడకు తీసుకువెళ్లారో కూడా తెలియదని, స్థానిక పోలీసు స్టేషన్లో అడిగితే సరిగ్గా సమాధానం రాలేదని కూడా ఆరోపించారు. అతడికి ఏమైనా అయితే.. ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రశ్నించారు. భారత్ వంటి సెక్యులర్ దేశంలో.. తాము ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తామని కూడా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ.. తన వీడియోను షేర్ చేసి తన ఆవేదన అందరికీ తెలిసేలాగా.. తనకు న్యాయం జరిగేలాగా తోడ్పడాలని అన్నారు.
నిజానికి రేష్మ ఆవేదన చాలా సబబైనదే. ఒక నేరానికి సంబంధించి పోలీసులు భర్తను అరెస్టు చేసి తీసుకు వెళితే.. ఆ కుటుంబం ఎంత తల్లడిల్లుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబంలో ఎలాంటి ఆందోళన ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాల్సి ఉంది.
ఏ వీడియోలో తన భర్త చెబుతున్న మాటలను ఆధారం చేసుకుని కేసులు పెట్టారో.. ఆ వీడియో చాలా సంవత్సరాల కిందటిది అని రేష్మ చెబుతున్నారు. అలాగే.. అది చాలా పెద్ద వీడియో అని… ఆ వీడియోలోని ఒక ముక్కను మాత్రమే చూపిస్తూ ఇప్పుడు కేసులు పెడుతున్నారని.. ఆలయాల మీద దాడి కేసుల్ని బనాయించాలని చూస్తున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ. నిజానికి ఇందులో డాక్టర్ రేష్మ కొత్తగా చెబుతున్న సంగతి ఏమీ లేదు.
Must Read ;- మతమార్పిడుల కోసమేనా పాస్టర్లకు జీతాలిస్తోంది: సోము వీర్రాజు
ఏ వీడియో ఆధారంగా అయితే పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మీద కేసులు నమోదు అయ్యాయో, అతను ప్రస్తుతం అరెస్టులో ఉన్నాడో.. సదరు వీడియోను చూసిన ఎవరికైనా సరే.. అది మరొక పెద్ద వీడియోలో చిన్న ముక్క మాత్రమే అనే సంగతి సులువుగా అర్థమవుతుంది. ఆయన మీద ఆలయాలపై దాడులకు సంబంధించి నింద వేయదలచుకున్న వారు.. దానికి సంబంధించిన భాగాన్ని మాత్రం కట్ చేసి ప్రచారంలో పెట్తారు. అది నిజమే. డాక్టర్ రేష్మ చెబుతున్న మరో సంగతి కూడా వాస్తవం. అది చాలా సంవత్సరాల కిందటి వీడియో అని ఆమె అంటున్నారు. మనకు తెలిసినంత వరకు అది రెండేళ్ల కిందటి వీడియో. అప్పట్లో హిందూ ఆలయాల మీద ఇప్పుడున్నంతగా దాడులు వార్తల్లోకి రాలేదనే మాట కూడా నిజం. అప్పటి వీడియోను ఇప్పటి దాడులకు ముడిపెడుతున్నారనేది ఆమె ఆవేదన. అంత వరకు కరక్టే.
కానీ.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రవీణ్ చక్రర్తి.. తాను వందల గ్రామాలను క్రీస్తు గ్రామాలుగా మార్చేస్తున్నట్లు చెప్పిన సంగతి, ఆ గ్రామంలో మరో దేవుడే లేనివిధంగా తీర్చిదిద్దినట్లు చెప్పిన సంగతి, అందుకోసం పాస్టర్లను నియోగిస్తున్నట్టు చెప్పిన సంగతి.. తాను హిందూదేవుళ్ల విగ్రహాలను కాలితో తన్ని, చెక్క- రాతి బొమ్మలేవీ దేవుడు కాదని ప్రజలకు నిరూపించినట్లు చెప్పిన సంగతి.. ఆ వీడియోలో (వీడియో ముక్కలో) ఉన్నాయి. ఈ సంగతులేవీ అబద్ధం అని డాక్టర్ రేష్మ కూడా చెప్పడం లేదు. పెద్ద వీడియోలో ఒక ముక్క చూపించి.. రాద్ధాంతం చేస్తున్నారని మాత్రమే అంటున్నారు.
డాక్టర్ రేష్మ.. తన భర్త ప్రవీణ్ చక్రవర్తి నిజంగానే క్షేమంగా.. ఎలాంటి తమకు సంబంధం లేని కేసుల్లో ఇరుక్కోకుండా బయటకు రావాలని కోరుకుంటూ ఉంటే గనుక.. ఆమె చెబుతున్న పూర్తి వీడియోను తానే స్వయంగా బయటపెడితే సరిపోతుంది. తన సెల్ఫీ వీడియోను ప్రతి అక్క ప్రతి చెల్లి, ప్రతి అన్న అందరికీ షేర్ చేయాలని అడిగే బదులు.. పూర్తి వీడియో బయటపెట్టి.. అది ఎప్పుడు షూట్ చేశారనే విషయాన్ని కూడా బయటపెట్టి.. అప్పట్లో ఇలాంటి విగ్రహాల ధ్వంసం కేసులేవీ నమోదు కాలేదని నిరూపించగలిగితే.. ప్రవీణ్ చక్రవర్తి చాలా సులభంగా బయటికొస్తారు. ఎవరి దయాదాక్షిణ్యాలు అందుకు అవసరం లేదు. అయితే.. తనద్వారా చాలా సింపుల్ గా పరిష్కారం కాగల సమస్యను, డాక్టర్ రేష్మ.. పూర్తి వీడియోను ఇంకా దాచి ఉంచడం ద్వారా.. మరింత జటిలం చేసుకుంటున్నారనే అభిప్రాయం పలువరిలో వ్యక్తం అవుతోంది.
Also Read ;- విగ్రహాల ధ్వంసం కేసులు.. కేంద్రం ఏడాదిగా నిర్లక్ష్యం!