బుధవారం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలామంది ప్రజల హృదయాల్లో ఉండిపోయిన నాయకుడు. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదంటే.. ఆయనకున్న ఆదరణే కారణం. ఈ నేపథ్యంలో ఆయన పట్ల భక్తి ప్రపత్తులు కావొచ్చు.. ఆయన కొడుకు జగన్ అధికారంలో ఉండడం వల్ల కావచ్చు.. ఆయన వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఆ పార్టీ నాయకులు ప్రతిచోటా ఉత్సాహపడడం తప్పు కాదు. కానీ.. వైఎస్ వర్ధంతికి హడావుడి చేసే నెపంతో.. నియోజకవర్గాల్లో నాయకులు ముఠాలుగా విడిపోయి కీచులాడుకోవడమే తప్పు.
కానీ చీరాలలో అదే జరిగింది. ఇక్కడ కరణం బలరాం, ఆమంచి కృష్ణ మోహన్ వర్గాలు వైఎస్సార్ ఫ్లెక్సిలు కట్టడానికి పోటీ పడ్డారు. దాదాపు ఘర్షణ పడేంత వాతావరణం నెలకొంది. చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్ ఆర్ వర్ధంతికి ఫ్లెక్సీలు వేసేందుకు ఆమంచి, కర్ణం బలరాం వర్గీయులు పోటీ పడ్డారు. ముందుగా చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం వర్గం స్థానిక వైఎస్ ఆర్ విగ్రహం చుట్టూ ప్లెక్సీలు కట్టారు. వారికి పోటీగా, పోటీగా ఆమంచి కృష్ణ మెహన్ వర్గీయులు కూడా వైఎస్ఆర్ విగ్రహం చుట్టూతనే ఫ్లెక్సీలు కట్టే ప్రయత్నం చేశారు.
విగ్రహం చుట్టూ ఎవ్వరూ ఫ్లెక్సీలు కట్టరాదంటూ స్ధానిక సీఐ రాజమోహన్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐ- ఆమంచిల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహపరిధిలో కట్టిన కరణం వర్గీయుల ప్లేక్సీలను కూడా తొలగించాలంటూ ఆమంచి వర్గీయులు ఆందోళన చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులతో ఆమంచి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి కట్టిన ప్లేక్సీలను తొలగిస్తామని సి.ఐ రాజ మోహన్ హమీ ఇచ్చారు. సిఐ హామీతో ఆమంచి వర్గీయులు వెనుదిరిగారు.
ఆమంచి- కరణం వర్గీయుల మధ్య తొలినుంచి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. అయితే ఇప్పుడు ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. పార్టీ ఒకటే అయినా వైరం మాత్రం తగ్గలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైఎస్సార్ పట్ల భక్తిని ప్రదర్శించుకోవడానికి వీరిద్దరూ ఇలా కీచులాడుకోవడమే నవ్వుల పాలయ్యేలా చేస్తోంది.











