జగన్ రెడ్డినేమీ అనలేక జనంపై కక్కుతున్న వైసిపి మంత్రులు
అకాల వర్షాలతో వేలకోట్ల విలువైన పంటలన్నీ కళ్లెదుటే నీళ్లపాలైన రైతులనుద్దేశించి వైసిపి మంత్రుల వ్యాఖ్యలు వింటోంటే వాళ్లకెంత అహం తలకెక్కిందో తెలుస్తోంది..‘‘అహం తలకెక్కింది, తలకు రోకలి చుట్టమన్నాట్ట’’ ఎనకటికెవరో..? మంత్రి కారుమూరు నాగేశ్వర రావు అన్న మాటలలాగే ఉన్నాయి చూస్తోంటే..‘‘మొలకలొస్తే నన్నేం చేయమంటార్రా ఎర్రిపప్పలారా’’ అన్న మంత్రి కారుమూరు వ్యాఖ్యలను బట్టి వైసిపి నేతల కళ్లెంత నెత్తికొచ్చాయో తెలుస్తోంది. అధికారం తెచ్చిన అహంభావమా..? ఓడిపోతామన్న అసహనమా..? ఇదమిద్ధంగా తెలీరాని స్థితిలో వైసిపి కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల ముందు చివరి ఏడాది తమ పరిస్థితిలా తారుమారైందనేది జీర్ణించుకోలేకే ఆ అక్కసును జనంపై వెళ్లగక్కుతున్నారు..
ఒకవైపు సర్వేల్లో వైసిపి గ్రాఫ్ 10-15% పతనం కావడం, మరోవైపు దేశంలోని ముఖ్యమంత్రులలో జగన్ గ్రాఫ్ 21వ స్థానానికి పడిపోవడం, పులిమీద పుట్రలా గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3స్థానాల్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడం, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో టిడిపి అభ్యర్ధిని పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించడం నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సహా వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు గంగవెర్రులెత్తుతున్నారు. రాబోయే ఎన్నికల ఫలితాలెలా ఉంటాయనేది ఇప్పటికే ధ్రువపడిపోవడంతో వారిలో అసహనం పెల్లుబుకుతోంది. టిడిపి ఒంటరిగా పోటీచేస్తే 100కు పైగా స్థానాల్లో గెలుపొందడం ఖాయమని, జనసేనతో పొత్తుంటే 150పైనే గెల్చుకుంటారనే వార్తలు గోరుచుట్టుమీద రోకటిపోటయ్యాయి..
ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది ‘‘గడపగడపకూ వైసిపి’’ కార్యక్రమాల్లో బైటపడింది. వెళ్లినచోటల్లా ఎమ్మెల్యేలను, మంత్రులను జనం నిలదీయడం తెలిసిందే..‘‘మా నమ్మకం నువ్వే, మా భవిష్యత్ నువ్వే జగనన్న’’ కార్యక్రమాలను తమ మెడకు తగిలించి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దాటి బైటకు రాకపోవడంపై మింగలేక కక్కలేక మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రతి ప్రోగ్రామ్ లో నాయకుడు ముందుండి నడపాలే తప్ప, తమను ముందుకునెట్టి వెనకుండి సిన్మా చూడటంపై మండిపడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిపై అక్కసును జనంపై చూపిస్తున్నారు వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు.
సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలెలా వికటించాయో విదితమే..‘‘మగాళ్లను పోరంబోకులని’’ ధర్మాన అనడంపై వైసిపి వాళ్లే ముక్కున వేలేసుకున్నారు. ఓటేసినోళ్లు మీ కంటికి పోరంబోకుల్లా కనిపిస్తున్నారా అని జనమే నిలదీస్తున్నారు. సభలకు తరలించిన జనాన్ని బైటకు వెళ్లనీకుండా గేట్లకు తాళాలు వేయడం, వాళ్లేమో గోడలు దూకి పారిపోవడం వైసిపి అంటే ప్రజలెంత బేజారెత్తిపోతున్నారో దృష్టాంతాలు..
ఇక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యల సంగతి చెప్పక్కర్లేదు..‘‘తాగివచ్చి అల్లరి చేస్తున్నారన్న’’ ఆయన మాటలపై జనం తిరగబడటం రాష్ట్రం మొత్తం చూసింది.. ఉద్యోగమడిగిన యువకుడి దవడ పగులగొడ్తానన్న ఎమ్మెల్యే కన్నబాబు రాజు వ్యాఖ్యలు వైసిపి నేతల అసహనానికి అద్దం పట్టాయి.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస రావు కాన్వాయ్ కు అడ్డంగా చెప్పుల దండలు కట్టడం వైసిపిపై వ్యతిరేకతకు మరో దృష్టాంతం.
ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే..ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తంతు..వైసిపి ఎమ్మెల్యేలు వెళ్లిన ప్రతిచోటా శృంగభంగాలే..నాలుగేళ్లలో కనీసం తొంగిచూడకుండా, ఏమీ చేయకుండా, తగుదునమ్మా అంటూ ఎన్నికల ఏడాదిలో ఇప్పుడు తమవద్దకు రావడంపై జనం మండిపడ్తున్నారు.
ఎన్నో చెప్పారు, అలవికాని వాగ్దానాలు చేశారు..మేనిఫెస్టోలో హామీలిచ్చారు, పాదయాత్రలో వాగ్దానాలు చేశారు. 9%కూడా చేయకుండానే 95% చేసేశామని చెప్పడంపై ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. తత్ఫలితమే ఈ నిరసనలు, నిలదీతలు..దాన్ని గ్రహించకుండా జనంపైనే వైసిపి ఎదురుదాడికి దిగడం, జనాన్నే నిందించడం వైసిపి వైఫల్యాలకు పరాకాష్ట..
మొన్న అనంతపురం జిల్లా పర్యటనకెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇదే పరిస్థితి ఎదురైంది.. ఇన్నాళ్లు గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి విధిలేని పరిస్థితిలో సాంకేతిక లోపం కారణంగా రోడ్డుమార్గాన వెళ్లాల్సి రావడం, ఆయన కాన్వాయ్ కు బాధితులు అడ్డం పడటం ఊహించని పరిణామం.. నాలుగేళ్లయినా ధర్మవరం నియోజకవర్గ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడంపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది..కారుదిగి వాళ్ల కష్టమేంటో కనుక్కోకుండా నిర్లక్ష్యంగా జగన్ రెడ్డి వెళ్లిపోవడం అగ్నికి ఆజ్యం పోసింది..సీఎం కాన్వాయ్ పైనే రాళ్లు విసరడం, చెప్పులేయడం తొలిసారే కావడం గమనార్హం. ఒక్క ముఖ్యమంత్రనే కాదు, మంత్రుల పరిస్థితీ అంతే, వైసిపి ఎమ్మెల్యేల పరిస్థితీ అంతే..
చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అన్నట్లుగా…ఈ పరిస్థితి వైసిపివాళ్లు చేతులారా తెచ్చుకున్నదే..ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రతినిధులు సాక్షాత్తూ ఆ ప్రజలకే పంగనామాలు పెట్టడంవల్లనే ఈ స్థాయి వ్యతిరేకతలు, నిరసనలు ఎల్లెడలా చూస్తున్నాం..ఇప్పటిదాకా ఈ 4ఏళ్లు నయానా భయానా నడిపించారు. అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో ప్రతిపక్షాలను అణిచేశారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులుపెట్టి జైళ్లకు పంపారు..సందట్లో సడేమియాల్లా దోచేశారు, స్కీముల్లోనూ స్కాములకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడా పరిస్థితి లేదు.
మరో 9నెలల్లో ఎన్నికలు తరుముకొచ్చాయి, ప్రజల వద్దకెళ్లాల్సిన తప్పనిస్థితి వచ్చింది. వెళ్దామంటే జనం వెంటబడ్తున్నారు, ఉందామంటే ఓటమి భయం వెంటాడుతోంది. నాయకుడేమో గాల్లోనో, పరదాల మాటునో ఉంటాడే తప్ప బైటకు రాడు..‘‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లైంది’’ వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి.. అధికారాంతమందున చూడాలనేది అందుకే..
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...