పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్న ఫలితమే ఇది..
ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్ ను కాదని, యాంటీ ఎంప్లాయీ గవర్నమెంట్ తో దుష్ఫలితాలే ఇవి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల పరిస్థితి చూస్తోంటే..వెరీ పిటీ..ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగులు ఉండటం 70ఏళ్ల రాష్ట్ర చరిత్రలో (ఆంధ్రరాష్ట్రంలోగాని, ఉమ్మడి ఏపిలోగాని, ఇప్పుడీ విభజిత ఏపిలోగాని..) ఇదే తొలిసారి..ప్రభుత్వాలనే తారుమారు చేసే శక్తి సంపన్నులని గతంలో పేరు..ముఖ్యమంత్రులకే దడపుట్టించే సత్తా ఉన్న వాళ్లని పేరు..కానీ ఇదంతా గతం, వర్తమానం దయనీయం, భవిష్యత్తు అగమ్యగోచరం..ఎన్టీ రామారావు, జయలలిత వంటి ఉద్ధండులనే ఎదిరించినవాళ్లని ఉద్యోగ సంఘాలకున్న గత ప్రతిష్ట ఇప్పుడేమైంది..? ఎందుకింత బలహీనమయ్యాయి ఏపి ఉద్యోగ సంఘాలన్నీ..?ఎన్టీ రామారావు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో స్వామినాథన్ , పూర్ణచంద్రరావు లాంటివాళ్లు సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు ఇలాగే ఉన్నాయా అసోసియేషన్లు..?
చంద్రబాబు కూడా అనేవాళ్లు నన్ను ఓడించింది ఉద్యోగులేనని, అందుకే ఫ్రెండ్లీ ఎంప్లాయీ గా మా ప్రభుత్వం ఉంటుందని 2014-19 మధ్య 5ఏళ్లలో చెప్పేవాళ్లు, ఎప్పుడే ఎంప్లాయీస్ మీటింగ్ కెళ్లినా అదే చెప్పేవాళ్లు..అలాంటిది గత 4ఏళ్లలో ఇంత బేలగా మారడం, దయనీయం కావడం ఆశ్చర్యం..ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది..? జగన్మోహన్ రెడ్డి కరకుతనమా..? ఉద్యోగ సంఘాల బేలతనమా..? అంటే రెండూ కారణమే..ఆయనకెదురుతిరిగితే ఉండది కూడా పోద్దనే భయం ఉద్యోగ సంఘాల్లో ఎప్పుడైతే ప్రవేశించిందో, అప్పుడే అవి నిర్వీర్యం అయ్యాయి..వీళ్లేనా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 13జిల్లాల్లో దడదడలాడించిందీ, కేంద్రాన్నే నిలదీసిందీ వీళ్లేనా..? అనే సందేహాలు సర్వత్రా ఉన్నాయి. ఒకటో తారీఖు జీతాలకోసం, పెన్షన్ల కోసం ఆబగా ఎదురుచూసే దుస్థితికి పాలకులను నిందించాలా..? సంఘాన్నింత బలహీనపర్చిన నాయకులను నిందించాలా..?
ఉద్యోగుల సొమ్ము వాడేసుకున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం, ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది.. ఉద్యోగుల జిపిఎఫ్ నిధులూ వాడేసుకున్నారంటే ఏమనాలి..? 68వేల ఖాతాల నుంచి రూ 413కోట్లు మళ్లించారట..రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలమంది ఉద్యోగుల పరిస్థితేంటి..? వాళ్ల భవిష్యత్ ఏంటి..? సిపిఎస్ కు ఉద్యోగుల వాటా సొమ్ము ‘‘ప్రాన్’’ అకౌంట్లలోది రూ 3వేల కోట్లు గల్లంతు(ఉద్యోగుల వాటా రూ 1500కోట్లు, ప్రభుత్వ వాటా రూ 1500కోట్లు)..సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి కటింగ్ 10%కు, మరో 10%కలిపి ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సిన సర్కార్ 12నెలలుగా ఎగ్గొట్టిందట..సిపిఎస్ హామీ నెరవేర్చక పోవడం ఒక జుమ్లా అయితే, ఉద్యోగుల సొమ్ము గల్లంతు చేయడం ఇంకో జుమ్లా..జగన్ జుమ్లాలు అన్నీఇన్నీ కావనేది ఉద్యోగులకు అర్ధమయ్యేసరికి జరగాల్సిన డేమేజి జరిగింది..
కోవిడ్ సమస్యలు, విభజన సమస్యల వల్లే ఇలా జరిగిందనే సంజాయిషీలు వింతగా ఉన్నాయి..విభజన కష్టాల్లో కూడా 43% ఫిట్ మెంట్ చంద్రబాబు ఎలా ఇచ్చాడు..? (తెలంగాణ కన్నా 1% ఎక్కువ).. అసోసియేషన్ నాయకులంతా ఎప్పుడుపడితే అప్పుడు సీఎంను కలిసేవారు, సిఎం ఛాంబర్ ముందే తారట్లాడేవాళ్లు..ఇప్పుడా పరిస్థితి ఉందా..? సీఎంను కలిసే పరిస్థితి ఎవరికైనా ఉందా..? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడీ సంఘాలింత బేలగా ఉన్నాయా..? ఆత్మ విమర్శ చేసుకోవాలి..
ఉద్యోగుల డిఏ బకాయిలు రూ 5,600కోట్లు సంక్రాంతి, ఉగాది అంటూ ఇప్పటికనేక సంక్రాతులు, ఉగాదులు గడిపేశారు.. అడిగేవాళ్లు లేరు, ఇచ్చేవాళ్లు లేరు.. ఈఎస్ ఐ నిధులు రూ 145కోట్లు వాడేశారు.. రాష్ట్రవాటా జమ చేయలేదు. కేంద్రం ఇచ్చిన సొమ్మూ దారిమళ్లించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 20లక్షల కుటుంబాలకు వైద్యసదుపాయాలు అందని దుస్థితి.. పెండింగ్ డీఏ బకాయిలు, జీపిఎఫ్, లోన్లు, అడ్వాన్స్ లు, మెడికల్ అలవెన్సులన్నీ కలిపి రూ 21వేల కోట్లకు పైగానే..
అసలీ పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? ఇలా ఉద్యోగుల సొమ్ములు వాడేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయా..? వాడేస్తుంటే ఇలా కళ్లు మూసుకున్న సంఘాలు ఉన్నాయా..? సిపిఎస్ రద్దు కోసం ఛలో విజయవాడకు పిలుపిచ్చిన టీచర్లనెంత భయపెట్టారో, ఉద్రిక్తం చేశారో, నిర్బంధించారో, అక్రమ కేసులు పెట్టారో రాష్ట్రం మొత్తం చూసింది..
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా మొన్న ఎద్దేవా చేశాడు..‘‘మేము టీచర్లకు 80% ఫిట్ మెంట్ ఇస్తే వాళ్లు లోనేస్తున్నారని..’’ ఎందుకింత ఎగతాళికి గురవ్వాల్సి వచ్చింది, ఎందుకింత ఎద్దేవాకు ఆంధ్రప్రదేశ్ ను గురిచేస్తున్నారు..? ‘‘ఎవరో కొట్టినందుకు కాదు, ఇంకెవరో దెప్పినందుకనేదో’’ సామెత తెలిసిందే..
రాష్ట్రంలో దాదాపు 10లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు..శాలరీ బిల్లు రూ 5,500కోట్లు ఉంటే అందులో పెన్షనర్లది రూ 1850కోట్లు ఉంటుంది..పదో తేదీ వచ్చినా 40%మందికి కూడా పెన్షన్లు పడలేదంటే దానిమీదే ఆధారపడి బతుకునీడ్చే పండుటాకుల పరిస్థితి ఏంటి..? పెన్షనర్లకు పెన్షన్ ఆపడం కన్నా అమానవీయం మరొకటి ఉందా..? దాదాపు రెండున్నర లక్షల మంది పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. ఒకవైపు వయోభారం, మరోవైపు అనారోగ్యం,ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిరావడం,పెరిగిపోతున్న వైద్యఖర్చులు, మందుల ఖర్చులు.. ఈ నేపథ్యంలో రెండో, మూడోవారాలకు కూడా పింఛన్లు వేయడంలేదంటే ఇంతకన్నా నిర్ధయ ఏముంటుంది..?
న్యూ ఇన్సూరెన్స్ లింక్ డ్ హెల్త్ స్కీమ్ అతీగతీలేదు..కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులైజేషన్ అతీగతీ లేదు..సిపిఎస్ రద్దు లేదు..అసలు జీతాలు, పెన్షన్లకే దిక్కులేదు..ఇంత దుర్బలంగా ఉద్యోగ సంఘాలు మారతాయనేది ఊహాతీతం..
ఒకసారి వస్తేనే ఈ ప్రభుత్వమిలా రూ 21వేల కోట్లు పెండింగ్ పెట్టి, రూ 145కోట్ల ఇఎస్ ఐ వాడేసుకుని, రూ 413కోట్ల జిపిఎఫ్ వాడేసుకుని, రూ 3వేల కోట్ల సిపిఎస్ సొమ్ము గల్లంతుచేసి, రూ 5600కోట్ల డిఏ బకాయిలు పెడితే మళ్లీ ఇదే ప్రభుత్వమే రేపొస్తే ఏమవుద్దనేది అగమ్యగోచరమే.. ఇవాళ అల్టిమేటం ఇస్తే రేపా సంఘం ఉంటుందో ఊడుద్దో..? ఆ నాయకుడికి ఏమవుద్దో అనే భయం వచ్చేసింది..ఇన్ని భయాల మధ్య వీళ్ల డిమాండ్లెలా నేరవేరతాయి..? భయం భయం..భయం గుప్పిట్లో ఆంధ్రప్రదేశ్ 4ఏళ్లుగా నలిగిపోతోంది..
ఉద్యోగులు, ప్రభుత్వం ఒకే కుటుంబం..కుటుంబ సభ్యులు వాళ్లంతా..కుటుంబాన్ని రోడ్డునపడేసే ఇంటి యజమానిని ఎలా చూడాలి..? 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు పడకపోతే కుటుంబపరువు రోడ్డున పడ్డట్లే కదా..? ఆమాత్రం ఇంగితం కూడా పాలకుల్లో లోపించడం శోచనీయం..
రూ 5600కోట్లు డీఏ బకాయిలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం గతంలో ఉందా..? ఈఎస్ ఐ నిధులు రూ 145కోట్లు వాడేసిన ప్రభుత్వాన్ని చూశారా..? సిపిఎస్ సొమ్ము రూ 3వేల కోట్లు గల్లంతు చేశారు. జిపిఎఫ్ నిధులు రూ 413కోట్లు లేపేసిన ప్రభుత్వాన్ని చూశారా..?
ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము పైసా అంటుకోవాలంటేనే భయపడేవాళ్లు. అలాంటిది ఇంత ధీమా ఎలా వచ్చింది అంటే వీళ్లిచ్చిన అలుసే తప్ప మరొకటి కాదు..‘‘పాలిచ్చే ఆవును వదిలేసి తన్ను దున్నపోతును తెచ్చుకున్నారని’’ యువగళం పాదయాత్రలో లోకేశ్ అంటోంటే, ఇప్పుడీ ఉద్యోగులను, పెన్షనర్లను చూస్తే అదే గుర్తొస్తోంది..
ఓటుబ్యాంకు పాలిటిక్స్ లో రాటుదేలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ల ఓట్లనెందుకు పరిగణలోకి తీసుకోవడంలేదో అర్ధం కాదు..10 లక్షల కుటుంబాలకు, ఇంటికి 4గురేసుకున్నా వాళ్లవే 40లక్షల ఓట్లు ఉంటాయి, అంతేకాదు వీళ్లు తలా ముగ్గురిని ప్రభావితం చేసినా కోటి పైగా ఓట్లను ప్రభావితం చేసే శక్తిగల వాళ్లు..అలాంటిది ఉద్యోగులపై, పెన్షనర్లపై వాళ్ల కుటుంబాలపై పాలకుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది..రేపు పోలింగ్ సిబ్బందిగా కూడా వీళ్లను ఉపయోగించేది లేదని, ఆ పనులూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికే అప్పగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని వింటున్నాం, ఆ దిశగా పావులు కదుపుతున్నారు కూడా..ఈ నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లంటే వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కరివేపాకులే..ఏదేమైనా పోరాడితే కోల్పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప అనే స్ఫూర్తితో ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటాలు ఫలించాలని ఆశిద్దాం..ఫ్రెండ్లీ ఎంప్లాయీ గవర్నమెంట్ ఏర్పాటులో వాళ్ల ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయనే ఆకాంక్షిద్దాం.