తిరుపతి ఉప ఎన్నిక అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హాట్ హాట్‌గా నడుస్తోంది. తిరుపతి పార్లమెంట్ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కావడంతో ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా జగన్ ఎవరిని నిలబెడతారనే ఉత్కంఠ పార్టీవర్గాల్లో నెలకొంది. అయితే కొన్ని రోజులుగా నెలకొన్న సప్పెన్స్ కు తెరదించుతూ అభ్యర్థి ఎంపిక విషయంలో తాజాగా ఆ పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఫిజియోథెరపిస్టు వైద్యున్ని బరిలోకి దింపుతున్నట్లు తెలిసింది. తిరుపతి ఎంపీ అకాలమరణం చెందడంతో ఆయన కుటుంబ సభ్యులకే పార్టీ టిక్కెట్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ ఎవరైనా చనిపోతే వాళ్ల కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చే సాంప్రదాయం రాజకీయాల్లో నడుస్తోంది. కానీ ఈ సాంప్రదాయానికి భిన్నంగా వైఎస్ఆర్ పార్టీ దుర్గప్రసాద్ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వకుండా ఒక ఫిజియో థెరపిస్ట్ వైద్యునికి తిరుపతి నుంచి బరిలో దింపేందుకు సిద్ధమవడం గమనార్హం.
ఎవరీ గురుమూర్తి…
ఈ ఫిజియో థెరపిస్టు డాక్టర్ పేరు గురుమూర్తి. తన వయస్సు కూడా 27 ఏళ్లే. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఫిజియో థెరపిస్టుగా ఈయన సేవలందించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం కారణంగానే దుర్గప్రసాద్ కుటుంబ సభ్యులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తిరిపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ కరోనా కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇలా జరిగినపుడు సాధారణంగా పార్టీలు వారి భార్యనో, కుమారుడినో అభ్యర్థిగా ఎంచుకోవడం మామూలు విషయమే. అందులో కొత్తేమీ లేదు. అదే ఫార్ములాను అధికారిక పార్టీ కూడా ఫాలో అవుతదని అంతా అనుకున్నారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికే పార్టీ టికెట్ ఇవ్వబోతున్నారనే ముందస్తు ఊహాగానాలు వచ్చాయి. ఒకవేళ అతను తిరస్కరిస్తే దుర్గాప్రసాద్ భార్యకు అయినా టిక్కెట్ ఇస్తారనే చర్చ జరిగింది. కానీ ఈ సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా దుర్గ ప్రసాద్ కుటుంబ సభ్యులకు కాదనకుండా జగన్‌కు వైద్య సేవలు అందించిన వ్యక్తికి టిక్కెట్ కట్టబెట్టడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని బరిలోకి దింపుతున్న విషయం తెలిసిందే.