ఎన్నికల హామీలు ఒక్కొక్కటి అటకెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చాక రైతులకు లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం, రూ.3 లక్షల వరకు పావలా వడ్డీకి పంట రుణాలు ఇస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని విస్మరించారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వీరిలో 18 లక్షల మంది లక్ష రూపాయలలోపు పంట రుణం తీసుకున్నారు. వీరికి సున్నా వడ్డీ పథకం అమలు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా లక్షలోపు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లించింది. అయితే నేడు పరిస్థితి తారుమారైంది. ముందుగా రైతులు వడ్డీ చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే అప్పుడు రైతుల ఖాతాలో వేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు.
సున్నావడ్డీ పథకం ఉందా?
2020 ఖరీఫ్ నుంచి 18 లక్షల మంది రైతులు తీసుకున్న లక్షలోపు పంట రుణాల వడ్డీకి ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. అయితే నేటికీ విడుదల చేయకపోవడంతో రైతులే రుణాలు, వడ్డీలు చెల్లిస్తున్నారు. బ్యాంకులు కూడా రైతుల నుంచి ముక్కుపిండి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం సున్నావడ్డీ రాయితీ విడుదల చేస్తే రైతుల ఖాతాలో వేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. అంటే బ్యాంకర్లకు కూడా ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది.
ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీ నిధులు విడుదల చేసినప్పుడు చూద్దాం అన్న చద్దంగా పరిస్థితి తయారైంది. ఒక వేళ వడ్డీ రాయితీ విడుదల చేసినా ఎంత విడుదల చేస్తుందో కూడా చూడాలంటున్నారు బ్యాంకర్లు. దీంతో పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీ నిలిచిపోయి రైతులపై భారం పడుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
పావలా వడ్డీ కథేంటి..
లక్ష వరకు పంట రుణం తీసుకున్న రైతులకు పూర్తిగా వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. లక్ష నుంచి 3 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి పావలా వడ్డీ వర్తిస్తుంది. ఆపైన వడ్డీని రైతులు చెల్లించాల్సి ఉంది. ఈ పథకం గత పదేళ్ల నుంచి అమల్లో ఉంది. అయితే ఏడాది కాలంగా ప్రభుత్వం వడ్డీ రాయితీకి నిధులు విడుదల చేయకపోవడంతో పథకం నిలిచిపోయింది. బ్యాంకర్లు కూడా రైతుల వద్ద నుంచి పంట రుణాలపై వడ్డీలను వసూలు చేయడం ప్రారంభించారు. దీంతో రైతులపై రుణభారం పెరిగిపోతోంది. ఒక ఏడాది పంట రుణం చెల్లించలేకపోతే వాటిపై వడ్డీలు పెరిగిపోయి పెనుభారంగా మారుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో ఇలా ఉంది
గతంలో రైతులు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించగానే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేసేంది. దీని వల్ల రైతుల వద్ద నుంచి బ్యాంకర్లు లక్ష రుణం వరకూ వడ్డీ వసూలు చేయలేదని రైతులు చెబుతున్నారు. ఇక లక్ష దాటిన వారు పావలా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. గతంలో 2 లక్షల పంట రుణం తీసుకున్న రైతులు సకాలంలో రుణం చెల్లిస్తే రూ.4 వేలు మాత్రమే వడ్డీ చెల్లించేవారు. అది నేడు రూ.14 వేలు చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇలా ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రూ.1800 కోట్లు వడ్డీ రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోందని రైతు సంఘాలు నాయకులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీ రాయితీని ప్రతి సంవత్సరం సకాలంలో విడుదల చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.











