ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధి.. సమాజ సేవకులుగా పనిచేయాలన్న మహోన్నత లక్ష్యంతో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా తమ వేతనాలను పెంచాలన్న వలంటీర్ల డిమాండ్ తో వారందరికీ లేఖలు రాసిన జగన్.. వారి సేవలను ఆకాశానికెత్తి.. వారిది కేవలం సేవేనని, వారికి ఇచ్చేది గౌరవ వేతనమేనని ప్రకటించి వలంటీర్ల వ్యవస్థ ఉన్నతిని మరింతగా పెంచారు. ఇలాంటి వ్యవస్థపై ఇప్పుడు జగన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాలతో వేగలేక చాలా మంది వలంటీర్లు నరకయాతన అనుభవిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా అధికారులు కూడా వలంటీర్లపై బెదిరింపులకు దిగడంతో పాటుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపాలిటీలో వార్డు వలంటీర్ గా పనిచేస్తున్న ఓ మహిళపై అక్కడి మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా మహిళ అని కూడా చూడకుండా ఐదు నిమిషాలు లోపలేసి ఉతికిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
నరసరావుపేటలోని నిమ్మతోట ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం మహిళ వలంటీర్ గా పనిచేస్తోంది. విధి నిర్వహణలో నిక్కచ్చిగానే వ్యవహరించడంతో పాటుగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న తొలి నలుగురు వలంటీర్లలోనూ ఆమె స్థానం సంపాదించిందట. మొన్నటిదాకా ఆమె పనితీరుపై ప్రశంసలు కూడా కురిశాయట. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కారణంగా ఆమె ఇటీవల కొన్ని రోజుల పాటు సెలవు పెట్టిందట. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. వార్డు సచివాలయంలోని అడ్మిన్ ఆమెపై పగబట్టేశారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదని నిత్యం నిందిస్తూనే ఉన్నాడు. అయినా పంటి బిగువున ఆ వేధింపులను భరిస్తూనే పనిచేస్తున్న ఆమెకు ఓ మధ్యాహ్నం కమిషనర్ రామచంద్రారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే కమిషనర్ ఆమెను బెదిరింపులపై బెదిరింపులకు దిగుతూ ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? పనిచేస్తున్నావా?.. ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యాహ్నం సమయం కదా.. ఇంటిలో ఉన్న తన పిల్లలకు భోజనం పెడదామని ఇంటికొచ్చాను సార్ అంటూ ఆమె సమాధానం చెప్పినా.. ఆయనగారు శాంతించలేదు.
ఐదు నిమిషాలు చాలట
ఉన్నపళంగా వార్డులోకి రావాలంటూ హుకుం జారీ చేశారు.కమిషనర్ ఆదేశాలు కదా తప్పక పాటించాల్సిందే కదా. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వార్డులోకి వెళ్లిన ఆమెకు కమిషనర్ కనిపించలేదు. సార్ వార్డులోకి వచ్చాను అంటూ ఆమె కాల్ చేస్తే.. కమిషనర్ కార్యాలయానికి రావాలంటూ చెప్పారు. ఉన్నతాధికారి కదా.. ఆయన ఆదేశాల మేరకే ఆమె పరుగు పరుగున కార్యాలయానికి వెళ్లగా.. అక్కడా కమిషనర్ లేరట. ఆమె అక్కడికి చేరుకున్న అరగంటకు అక్కడికి వచ్చిన కమిషనకర్.. ఆమెపై తనదైన దురహంకారంతో విరుచుకుపడ్డారు. ఎక్కడున్నావ్? ఇలా చేస్తే 5 నిమిషాల్లో లోపలేయించి ఉతికిస్తా.. అంటూ చిందులు తొక్కారు. తానేం చేశానంటూ ఆ లేడీ వలంటీర్ వివరణ ఇచ్చే యత్నం చేయగా.. ముఖానికి ఉన్న మాస్కును విసురుగా తీస్తూ ఆమెపైకి దాడికి వచ్చేలా ఉరుమిఉరిమి చూసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ.. ఇక్కడ అవసరం లేదు.. వెళ్లి ఎమ్మెల్యేను కలువు అంటూ వెళ్లిపోయారు. ఈ మొత్తం దృశ్యాలను ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి దానిని ఇప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆపై బాధితురాలు కూడా తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ మరో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- వలంటీర్ ఆత్మహత్యకు జగన్ కారణమా?











