ఏపీలోని వైసీపీ సర్కారు.. అందులోనూ ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునే దాకా విశ్రమించే ప్రసక్తే లేదన్నట్లుగా సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజును అరెస్ట్ చేసి తీరతామని ఇదివరకే సాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. సాయిరెడ్డి ప్రకటనకు అనుగుణంగా ఇప్పుడు వైసీపీ సర్కారు కూడా ఒకదాని తర్వాత మరొకటి, ప్లాన్ ఏ ఫెయిలైతే.. ప్లాన్ బీ అన్నట్లుగా సాగుతోంది. గజపతిరాజును ఇబ్బంది పెట్టే క్రమంలో మొన్నటిదాకా చేపట్టిన చర్యలన్నీ వమ్ము కాగా.. ఇప్పుడు వరుసపెట్టి రెండు వ్యూహాలను వైసీపీ అమలులోకి తీసుకొచ్చేసింది. ఇందులో ఒకటి అశోక్ గజపతిరాజు కుటుంబం నుంచే మొదలు కాగా.. మరొకటి మాత్రం మాన్సాస్ ట్రస్టుల్లో అక్రమాలను వెలికితీయాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ రెండూ సోమవారం నాడే మొదలు కావడం విశేషం
విజిలెన్స్ విచారణకు ఆదేశాలు
మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే మాన్సాస్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును ఆ పదవి నుంచి తప్పించేసి అశోక్ సోదరుడు ఆనంద గజపతి రాజు తొలి భార్య కూతురు
సంచయితను చైర్ పర్సన్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం సాగించిన అశోక్.. హైకోర్టులో జగన్ సర్కారుపై విజయం సాధించారు. కోర్టు ఆదేశాలతో సంచయిత చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఆ వెంటనే అశోక్ తిరిగి మాన్సాస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అయితే సంచయిత చైర్ పర్సన్ గా ఉన్నంత కాలం మాన్సాస్ లో మాన్సాస్ అక్రమాల ఊసెత్తని జగన్ సర్కారు.. అశోక్ తిరిగి చైర్మన్ కాగానే అక్రమాల పాట ఎత్తుకుంది. ఇందులో భాగంగా మాన్సాస్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మాన్సాస్ ట్రస్టుతో పాటు సింహాచలం ఆలయ పరిధిలోని భూముల్లో కొన్నింటిని జాబితా నుంచి తొలగించి వాటిని ఇతర అవసరాలకు వాడుకున్నారని వైసీపీ సర్కారు చెబుతోంది. ఈ భూముల తాజా లెక్క తేల్చాలని విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి దేవదాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి సస్సెండ్ అయిన సంగతి తెలిసిందే.
అప్పుడు సంచయిత.. ఇప్పుడు ఊర్మిళ
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయడానికి కాస్తంత ముందుగా ఊర్మిళ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు అంశంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆనంద గజపతిరాజు రెండో భార్య అయిన ఊర్మిళ మాన్సాస్ ట్రస్టు చైర్మన్ విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. అశోక్ గజపతిరాజును చైర్మన్ గా కొనసాగిస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఊర్మిళ మాన్సాస్ ట్రస్టుకు వారసురాలేనని ఆమె తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. మొత్తంగా అటు విజిలెన్స్ విచారణ, ఇటు ఊర్మిళ హైకోర్టులో పిటిషన్ చూస్తుంటే.. అశోక్ గజపతిరాజును ఏదో రకంగా ఇబ్బందుల పాలు చేయాలని, ఏకంగా ఆయనను అరెస్ట్ చేయాలన్న దిశగా వైసీపీ సర్కారు కదులుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అటు ఎన్జీటీ, ఇటు మావోయిస్టులు.. వైసీపీకి బ్యాండ్ బాజానే