వలంటీర్ వ్యవస్థను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పని భారం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వలంటీర్ల చావులకు కారణమవుతున్న వైనం కలకలం రేపుతోందనే చెప్పాలి. సర్కారీ ఉద్యోగులుగా కాకుండా సేవకులుగానే వలంటీర్లను పరిగణిస్తున్నామని చెబుతున్న జగన్.. వారి సేవలకు ప్రతిఫలంగా వేతనం కాకుండా ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై ఆదిలో ఎలాంటి క్లారిటీ ఇచ్చారో తెలియదు గానీ.. మొన్నామధ్య రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనాల డ్రౌవర్లు తమ వేతనాలను పెంచాలంటూ ఆందోళనకు దిగిన సమయంలో వలంటీర్లు సైతం నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వలంటీర్లను ఉద్దుశించి జగన్ ఓ లేఖ విడుదల చేశారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారంతా ప్రజా సేవకులని, సేవలకు వేతనాలు ఎక్కడా ఇవ్వరని, అందుకే సేవ చేస్తున్న వలంటీర్లకు తాము వేతనాలు ఇవ్వడం లేదని, కేవలం ప్రోత్సాహకం మాత్రమే అందిస్తున్నామని ప్రకటించారు. దీంతో వలంటీర్లు అయితే శాంతించారు గానీ.. భవిష్యత్తులో ఇదే వలంటీర్ వ్యవస్థ జగన్ ను నిండా ముంచేస్తుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అనంతలో వలంటీర్ ఆత్మహత్య
ఇలాంటి వాదోపవాదాల నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న వైనం, ఈ సందర్భంగా అతడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ‘‘నా చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం’’ అంటూ వార్డు వాలంటీర్ మహేష్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పట్టణంలోని నాల్గవ సచివాలయం తొమ్మిదో వార్డులో మహేష్ వార్డు వాలంటీర్‌గా ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లోనే ఉరి వేసుకుని మహేస్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం మహేష్ ఆత్మహత్య లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాలంటీర్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం.. మూడు పూటల వలంటీర్లు అన్నం తినగలుగుతున్నారా అంటూ ఎవరూ ఆలోచించడం లేదని మహేష్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తలాంటి పరిస్థితి మరొక వాలంటీర్‌కు రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూడాలంటూ మహేష్ వేడుకున్నాడు.
ఒత్తిడి నిజమే
వలంటీర్లపై పని ఒత్తిడి ఓ రేంజిలో ఉందన్న మాట వాస్తవమే. ఎందుకంటే.. ఓ వలంటీర్ తనకు పరిధిలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ప్రతి సాయాన్ని స్వయంగానే అందించాలి. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా తన పరిధిలోని కుటుంబాలకు చేరవేయాలి. నిత్యం తన పరిధిలోని కుటుంబాలతో టచ్ లో ఉండాలి. తన పరిధిలోని ఏ కుటుంబానికి ఏ పథకం వర్తిస్తుందో కనిపెట్టగలగాలి. ఆయా పథకాల అర్హతలు తెలిసి ఉండాలి. వాటి కోసం గ్రామ, వార్డు సచివాలయాలతో నిత్యం అనుసంధానమై ఉండాలి. మొత్తంగా సీఎంకు ఏ మేర అవగాహన ఉంటుందో.. ఆ స్థాయిలోనే వలంటీర్లకు కూడా అవగాహన తప్పనిసరి. మరి ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలతో ఇవన్నీ ఎలా సాధ్యమన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వ పథకాల అమలులో సచివాలయాలు, వలంటీర్లు ఎలా పనిచేస్తున్నారో చూడాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, జిల్లా స్థాయి అధికారులు మారు వేషాల్లో సచివాలయాలకు వచ్చి హడావిడి చేయడం, పొరపాట్లు చేసిన వలంటీర్లను అందరి ముందే మందలించిన తీరు.. ఇలాంటి వ్యవహారాలతో వలంటీర్లు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- భారీ స్కాంలో జగన్ జిల్లా కీలక భూమిక











