పైన కనిపిస్తున్న ఫొటో ఎక్కడిదో కాదు. ఏపీలో తీసినదే. అది కూడా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంగా కృష్ణా జిల్లా చెవిటికల్లు సమీపంలో తీసిన ఫొటోనే అది. ఫొటోలో ఏకంగా 150కి పైగా లారీలు, వాటిలోకి ఇసుకను నింపేందుకు తరలివెళ్లిన పదికి పైగా జేసీబీలు అలా వరద నీటిలో చిక్కుకుపోయాయి. మరి వీటిని అక్కడికి తీసుకెళ్లిన డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఎక్కడ అంటారా? ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు వెళ్లి పడవల సహాయంతో డ్రైవర్లు, ఇతర సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇలా శనివారం మధ్యాహ్నం దాకా 200 మందిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు.. ఇంకా ఎవరైనా ఆ వాహనాల్లో చిక్కుకున్నారేమోనని పరిశీలిస్తున్నారు. మనుషులను ఒడ్డుకు చేర్చిన పోలీసులకు.. నదిలోకి వెళ్లి నీటిలో చిక్కుకుపోయిన లారీలు, జేసీబీలను మాత్రం బయటకు తీసుకురావడం కుదరడం లేదట. మరి వరద పెరిగేలోగా.. ఈ లారీలు, జేసీబీలను పోలీసులు బయటకు తీసుకువస్తారో?.. లేదంటే వరద ఉధృతి పెరిగితే.. ఆ నీటిలోనే ఈ లారీలు, జేసీబీలు కొట్టుకుపోతాయో చూడాలి. మొత్తంగా శనివారం కనిపించిన ఈ దృశ్యాలు ఏపీ వ్యాప్తంగా వైరల్ గా మారిపోగా.. ఆ లారీలు, జేసీబీల యజమానులు మాత్రం క్షణమొక యుగంగా గడుపుతున్నారట.
ఈ ఫొటో వెనుక స్టోరీ ఏంటంటే..?
సరే.. ఫొటో గురించి బాగానే చెప్పుకున్నాం కదా. మరి ఈ ఫొటో వెనుక ఉన్న స్టోరీ ఏమిటన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ ప్రమాణం చేయగానే.. ఆ పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు తెర తీశారన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే కదా. ఇసుక పాలసీపై సరికొత్త ఫార్మ్యూలా రంగంలోకి రాగా.. వైసీపీ నేతలు మాత్రం అందిన కాడికి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పరిధిలోని కృష్ణా నదిలో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమేనన్నట్లుగా శనివారం నాడు ఇసుక కోసం నదిలోకి వెళ్లిన 150 లారీలు, జేసీబీలు వదర నీటిలో చిక్కుకుపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో అంతకంతకూ ప్రవాహం పెరుగుతోంది. అయితే ఇవేమీ పట్లని ఇసుక అక్రమార్కులు.. కృష్ణా జిల్లా చెవిటికల్లు సమీపంలో నదిలోకి ఇసుక కోసం వాహనాలను పంపారు. వైసీపీ నేతల అనుచరులు ఇసుక లోడింగ్ లో ఉండగా.. నదిలో ఒక్కసారిగా వరద కారణంగా ప్రవాహం పెరిగిపోయింది. దీంతో దిక్కుతోచని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వైసీపీ నేతలు పోలీసులను పంపించి తమ మనుషులను ఒడ్డుకు చేర్చగలిగారు. అయితే లారీలు గానీ, జేసీబీలను గానీ బయటకు తీసుకురావడం కుదరడం లేదు.
ఇసుక దోపిడీ నిజమేగా!
ఏపీలో జగన్ సర్కారు హయాంలో భారీగా ఇసుక దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి విపక్ష టీడీపీ సహా జనసేన, బీజేపీ, వామపక్షాలు పలు ఘటనలను ఉదహరిస్తున్నాయి. తాజాగా వీటిలో ఏ ఒక్క పార్టీ యత్నించకుండానే.. స్వయంగా వైసీపీ నేతలే అడ్డంగా దొరికిపోయారు. వరద రూపేణా దొరికిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీని పెను ప్రమాదంలో పడేసిందనే చెప్పాలి. తమ ఇసుక అక్రమాలను డిఫెండ్ చేసుకునేందుకు కూడా వైసీపీ నేతలకు అవకాశం లేకుండాపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇకపై వైసీపీ నేతల అక్రమ ఇసుక వ్యాపారాలకు సహకరించే లారీలు, జేసీబీ యజమానులు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారన్న వాదనలూ లేకపోలేదు. ప్రస్తుతం చెవిటికల్లులో నీటిలో చిక్కుకుపోయిన లారీలు, జేసీబీలు బయటకు వస్తే సరేసరి.. లేదంటే వాటి యజమానులకు కోట్ల మేన నష్టం తప్పదు.
Must Read ;- వలంటీర్ ఆత్మహత్యకు జగన్ కారణమా?











