(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన పలాసలో జాగా కనిపిస్తే అక్రమార్కులు పాగా వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాలపై పెద్దలు గెద్దల్లా వాలిపోతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు, అధికారుల చేతివాటంతోనే ఈ వ్యవహారం సాగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పేదల స్థలాల్లో..
శ్రీకాకుళం జిల్లాలోని పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో పేదలకు కేటాయించిన స్థలాల్లో పెద్దలు పాగా వేస్తున్నట్లు ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమణలకు పాల్పడి, అమ్మకాలు చేపడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం పురుషోత్తపురం రెవెన్యూ పరిధి సూర్యాకాలనీ ప్రాంతం సర్వేనెంబర్ 48, 49ల్లో పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేశారు. పల్లం ప్రాంతంలో మంజూరు చేసిన స్థలాల్లో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారు. గుట్టలుగా ఉన్న ప్రాంతం అనుకూలంగా లేకపోవడంతో ఆ స్థలాలు వృథాగా ఉండేవి. ఇలాంటి స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. తాజాగా ఆ ప్రాంతాన్ని కొందరు చదును చేసి, బండరాళ్ల తొలగింపు పనులు చేపట్టి, 100 చదరపు గజాల ఇంటిస్థలం రూ.5లక్షలు చొప్పున విక్రయాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సమీపంలోని దేవాలయ స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే పేదలకు కేటాయించిన ప్రాంతంలో పిల్లర్లతో భవంతుల నిర్మాణానికి సిద్ధపడుతున్నట్లు భోగట్టా.
రెవెన్యూ సిబ్బంది సహకారంతో..
కొందరు రెవెన్యూ సిబ్బంది సహకారంతో గతంలో పనిచేసిన అధికారుల పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటిస్థలాల విక్రయాలు చేపడుతున్నట్లు వినికిడి. మరోవైపు సూదికొండ సచివాలయం సమీపంలో భవన నిర్మాణానికి పిల్లర్లకు గోతులు తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గూడు కోసం స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పేదలు కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని, అక్రమార్కుల అడుగులకు మడుగులు వత్తుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పేదల కోసం కేటాయించిన స్థలాలు ప్రస్తుతం బడా నాయకుల వశమవుతున్నాయని, గతంలో పనికి రావనుకున్న స్థలాలు ఇప్పుడు కాసులు కురిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సూర్యాకాలనీ ప్రధానరోడ్డుకి ఇరువైపులా జరుగుతున్న ప్రభుత్వ స్థలాల విక్రయాలపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.











