(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
‘ఎవరో పుట్టించిన బిడ్డను తానెళ్లి ఉయ్యాల్లో వేసి జోల పాడాడట‘ అనేది వెనుకటికి ఒక సామెత. అచ్చం అదే విధంగా శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో జరిగిన ఒక సంఘటన టీడీపీ, వైసీపీ మధ్య వాద, ప్రతివాదనలకు దారి తీసింది. రాజకీయ వైషమ్యాలకు ఆద్యం పోసింది.
అన్ లాక్‌తో ..
కరోనా నేపధ్యంలో స్తంభించిన రవాణాను అన్ లాక్‌తో పునరుద్ధరించారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు నడుపుతోంది. రైల్వే మాత్రం ఇంకా పరిమిత సంఖ్యలోనే సర్వీసులు నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రం, ఉద్దానం ముఖద్వారమైన పలాస నుండి వేలాది మంది విశాఖకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పలాస నుండి విశాఖ రావాలన్నా, పోవాలన్నా చెరోపక్క ఐదు గంటల సమయం పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతమైన ఇచ్చాపురం, సోంపేట, బారువ, కవిటి, మందస, హరిపురం తదితర మండలాల నుండి విశాఖ చేరుకోవాలంటే రోడ్డు ప్రయాణం సాధ్యంకాదు. అందువల్ల వారంతా పలాస చేరుకుని రైల్లో విశాఖ వచ్చి వెళుతుంటారు. పలాస నుండి విశాఖ మూడు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. రైళ్లు నడవక పోవడంతో ఆ ప్రాంత ప్రజలు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు.
Also Read:-http://దివినుంచి భువికి..నేల టిక్కెట్ ధరకే విమానయానం
ఎంపీ రామ్మోహన్ కృషితో ..
పలాస ప్రాంత వాసుల సమస్యను గుర్తించిన స్థానిక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రైల్వే ఉన్నతాధికారులకు ఈ సమస్యను తేదీ 24.09.2020న ఎల్ ఆర్ నెం 536/ ఎంపీ ఆఫీస్ 2020 ద్వారా లిఖిత పూర్వకంగా తెలిపారు. ఈ లేఖను విశాఖ రైల్వే డివిజన్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్ల నుండి ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకున్నారు. అనంతరం పలాస నుండి విశాఖ ప్రత్యేక రైలు నడిపేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంపీ రామ్మోహన్ నాయుడుకు 02.11.2020న విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు.
మంత్రి ‘సీదిరి’ అత్యుత్సాహం
రైలును సాదాసీదాగా ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సమాయత్తమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరగణంతో రైలు ప్రారంభ సమయానికి స్టేషన్‌కు చేరుకున్నారు. విశాఖ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునేందు మంత్రితో పాటు వైసీపీ ఉబలాటపడినట్లు తెలుస్తోంది.
ఎంటరైన టీడీపీ
ఈ సంఘటనను నిశితంగా పరిశీలించిన స్థానిక టీడీపీ శ్రేణులు రంగప్రవేశం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీని ఆహ్వానించాలని, ఆయనతో ప్రారంభించాలని, రైల్వే అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు ఎలా పాల్పడ్డారని ప్రశ్న లేవనెత్తారు. ఈ విషయంపై సమగ్ర వివరాలు అందజేయాలని, అందుకు బాధ్యులు ఎవరు, వారిపై తీసుకుంటున్న చర్యలు ఏంటో తెలపాలని రైల్వే ఉన్నతాధికారులకు ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాయడంతో సంబంధిత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:-టీడీపీకి కొత్త కమిటీలు… బాబు లెక్క సరిచేసినట్టేగా
ఇలా ఇరు పార్టీల మధ్య రగులుతున్న సమస్య రైల్వే అధికారుల మెడకు చుట్టుకునేలా ఉందని జిల్లా అంతటా చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాలి.