తెలంగాణలోని సూర్యపేటలో కరోనా ధాటికి ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి పాజిటివ్ రావడం స్థానికంగా కలకలంరేపింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆ కాలనీ మొత్తం దిగ్భందించి మరీ యుద్ధప్రాతిపదికన శానిటైజేషన్ చేయడం ప్రారంభించారు. మరి అందరినీ కరోనా ఎలా సోకిందా అని అధికారులు ఆరా తీయగా.. కొన్ని నిజాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యులంతా ఓ అంత్యక్రియలకు హాజరైనట్టు తెలియవచ్చింది. అక్కడికి హాజరైనా వారందరూ ఐసోలేషన్ పాటించాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
అంత్యక్రియలకు హాజరైన వారిలో ఒక వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తగా కొవిడ్ పరిక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. ఇంకేముంది.. అందరికీ వరసగా టెస్ట్ లు మొదలుపెట్టారు. ఒక్కరిని కూడా వదలకుండా కుటుంబాన్నంతా కబలించింది కరోనా. మొత్తంగా 22 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక మూలాలను వెతికి వారికి జాగ్రత్తలు తీసుకోండంటూ మొరపెట్టుకోవడం అధికారుల వంతైంది. ప్రస్తుతం యాదాద్రి టౌన్ షిప్‌లో ఈ తతంగానికి హాజరైన వారందరినీ వెతికి పట్టుకునే పనిలో పడ్డారు అధికారులు.











