(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్ర–ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో సరిహద్దు వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇదివరకు విజయనగరం జిల్లా కొఠియా ప్రాంతం, ఒడిశా నారాయణపట్నం సమితిలోని చినకరిభద్ర గ్రామాల సరిహద్దుల వివాదం కంటే ఇటీవల శ్రీకాకుళం జిల్లా పొట్టంగి సమితి, సంబయి పంచాయతీలోని సునాబెడ గ్రామ సరిహద్దు వివాదం మరింత రాజుకునేలా కనిపిస్తోంది. ఈ సంఘటనపై ఉభయ రాష్ట్రాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అధికంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.
సైన్ బోర్డ్ లు తొలగించడం ..
ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఓ ప్రాంతం వారు పెట్టిన సైన్ బోర్డును ఇంకొక ప్రాంతం వారు తొలగించడం వంటి చర్యలు పోటాపోటీగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు వివాదాస్పద గ్రామమైన సునాబెడకు వెళ్లి, ఆంధ్రప్రదేశ్ డుంబిరిగుడ మండలం పేరిట ఏర్పాటు చేసిన సరిహద్దు బోర్డును తొలగించారు. అదే ప్రాంతంలో ఒడిశా తరఫున బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని వ్యతిరేకించిన సరిహద్దు ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజలు ఆ మరుసటి రోజే ఒడిశా తరఫున ఏర్పాటు చేసిన బోర్డును తీసివేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పార్టీల నేతలు ఏఓబీలోని నాలుగు గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, అక్కడి అడవులు, అటవీ భూములు తమవని, ప్రాణత్యాగానికైన సిద్దమవుతాము కానీ ఆ భూభాగాన్ని విడిచేది లేదని నినాదాలు చేసినట్లు తెలిసింది. ఈ వివాదంపై ఒడిశా సునాబెడ గ్రామస్తులు పొట్టంగి బ్లాక్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.
వివాదాస్పదమైన ఉపాధ్యాయుల పర్యటన
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో వివాదాస్పద కొఠియా గ్రామాల్లో రెండు రోజులుగా విజయనగరం జిల్లా ఉపాధ్యాయులు పర్యటించడం మరోసారి వివాదాస్పదమైంది. ఈ గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలతో ఆంధ్రా ఉపాధ్యాయులు సేకరిస్తున్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు జమ చేస్తామని, అందుకే వేలి ముద్రలు తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారంటూ గిరిజనులు అంటున్నారు. ఆంధ్రా ద్వారా ఒడిశా విద్యార్థులకు అమ్మ ఒడి వర్తింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొరాపుట్ జిల్లా యంత్రాంగం వారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై దర్యాప్తు చేయాలని వారు సూచించడంతో అలజడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక చోట ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతోంది.ఈ పరిస్థితి మరింత జఠిలం కాకముందే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉన్నతస్థాయి చర్చల ద్వారా సమస్య పరిష్కారించాలని సరిహద్దు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Must Read ;- లియో ఎఫెక్ట్ : గిరిజనుల సమస్యపై కదిలిన అధికారులు











