(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నేళ్లుగా గిరిజనులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. ఈ సమస్యపై ఇటీవల లియో న్యూస్ ‘ ఏనుగులతో నిత్యం నరకయాతన .. గిరిజనులకు కంటిమీద కునుకు లేదు’ శీర్షికన కథనం ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు.
అనువైన ప్రాంతం గుర్తింపునకు ..
తూర్పు కనుమల్లోని ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగుల హబ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు విజయనగరం, శ్రీకాకుళం డీఎఫ్‌వోలు సచిన్ గుప్తా, సందీప్ కృపాకర్ విజయనగరం జిల్లా పార్వతీపురం, కురుపాం అటవీ రేంజ్ పరిధిలో పర్యటించారు.
నీటి వనరులు ఉన్నచోట ..
అటవీ ప్రాంతంలో నీటి వనరులు, సరైన విస్తీర్ణం ఉన్న ప్రదేశాల్లో (హబ్) ఏనుగులు తిరిగేందుకు అనువుగా ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం రేంజ్ పరిధిలోని పెదమరికి, కొమరాడ పరిధిలో బంజుకుప్ప, నాగావళి నది అవతల ముంపు ప్రాంతం నిమ్మలపాడు, గరుగుబిల్లి మండలంలోని పాతగిజబను సందర్శించారు. వీటిలో అనువైన ప్రాంతం కోసం సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న గుంపులోని ఓ ఏనుగు ఎప్పటికప్పుడు విడిపోతూ విధ్వంసం సృష్టిస్తుండటంతో దాన్ని కట్టడి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పర్యటనలో పార్వతీపురం సబ్ డీఎఫ్‌వో రాజారావు, అటవీ రేంజ్ అధికారులు త్రినాథరావు, మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Must Read ;- అన్నీ అనుకూలం.. భోగాపురానికి వైభోగం










