సుమంత్ కథానాయకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ‘కపటధారి‘ సినిమా సిద్ధమైంది. కొంతకాలం క్రితం కన్నడలో వచ్చిన ‘కవలుదారి’ సినిమాకి ఇది రీమేక్. కన్నడలో ఈ సినిమా వైవిధ్యభరితమైనదిగా నిలిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఈ సినిమాను రూపొందించిన ప్రదీప్ కృష్ణమూర్తినే, తమిళంలోను ‘కబడదారి’ టైటిల్ తో రీమేక్ చేశారు. అక్కడ శిబి సత్యరాజ్ చేసిన పాత్రనే ఇక్కడ సుమంత్ చేశాడు. తాజాగా తెలుగు రీమేక్ కు రిలీజ్ డేట్ ఖరారైంది.
‘కపటధారి’ సినిమాను ఫిబ్రవరి 26వ తేదీన విడుదల చేయనున్నారు. దర్శక నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ పోస్టర్ వదిలారు. ధనుంజయన్ నిర్మించిన ఈ సినిమాలో సుమంత్ సరసన నాయికగా నందిత శ్వేత కనిపించనుంది. నాజర్ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, సుమన్ రంగనాథన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం విశేషం. గతంలో ఆమె సుమన్ జోడీగా ’20వ శతాబ్దం’ సినిమాలో అలరించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇంతకాలానికి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ఈ సినిమాలో సుమంత్ చాలా ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు. ఇంతవరకూ తాను చేయని పాత్రను ఈ సినిమాలో ఆయన పోషించాడు. ఈ పాత్ర తనకి చాలా సంతృప్తిని ఇచ్చిందనీ, ఈ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఇక కథానాయిక నందిత శ్వేత కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ, ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని ఆమె చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఇద్దరూ చాలాకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో వాళ్ల నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.
Must Read ;- అక్కినేని ఫ్యామిలీ హీరో సినిమా టీజర్ రెడీ.. !
https://twitter.com/iSumanth/status/1354430204739895304











