రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ .. తొలి రోజు నుంచి తన దూకుడు చూపుతూనే ఉంది. పోలీస్ పాత్రలపై రవితేజ మార్క్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ పాత్రలకు ఆయన బాడీ లాంగ్వేజ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందువలన ‘క్రాక్’ సినిమాలో ఆయన చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్ మసాలా అంశాలను ఫుల్లుగా దట్టించి వదిలిన ఈ కథ మాస్ ఆడియన్స్ కి పూర్తిగా ఎక్కేసింది. దాంతో ఈ సినిమాకి ఉన్న థియేటర్లు చాలక వేరే థియేటర్లలోను వేసుకోవలసి వచ్చింది.
అలా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించింది. 30 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. కరోనా భయం పూర్తిగా తొలగిపోక ముందే ఈ సినిమా ధైర్యం చేసి థియేటర్లకు వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో సాగుతోందని అంటున్నారు. ఇది నిజంగా రవితేజ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.
ఆసక్తికరమైన కథాకథనాలు .. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర .. శ్రుతి హాసన్ క్రేజ్ .. మాస్ అంశాలు .. పాత్రధారుల ఎంపిక .. విభిన్నంగా మలచబడిన సముద్రఖని – వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలు .. యాక్షన్ సన్నివేశాలు .. ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయని అంటున్నారు. ఇప్పట్లో ఈ సినిమాతో పోటీపడే పెద్ద సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఇటు రవితేజ .. అటు గోపీచంద్ మలినేని కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగానే చెప్పుకోవాలి.
Must Read ;- రవితేజ లేకపోతే నేను లేను క్రాక్ డైరెక్టర్