విజయ్ కుమార్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యేదాకా జనానికి పెద్దగా తెలియని పేరే. ఐఏఎస్ అధికారి అయిన విజయ్ కుమార్.. ఏ శాఖలో పనిచేస్తున్నారో కూడా తెలిసేది కాదు. విధి నిర్వహణ విషయంలో ఎలాంటి వారో తెలియదు గానీ.. పెద్దగా జనానికే కనిపించేవారు కాదు. అయితే జగన్ సీఎం అయ్యాక.. విజయ్ కుమార్ అంటే తెలియని ఏపీ వాసులు లేరనే చెప్పాలి. ఇందుకు రెండు కారణాలున్నాయి. అందులో మొదటిది.. జగన్ సీఎం కాగానే అత్యంత కీలక శాఖల్లో విజయ్ కుమార్ కు పోస్టింగ్ లు దక్కాయి. ఒకే సారి రెండు, మూడు కీలక శాఖల కార్యదర్శిగానూ ఆయన పనిచేశారు. దీంతో జగన్ జమానాలో అత్యధిక ప్రాధాన్యం దక్కిన అధికారిగా ఆయనను జనం గుర్తించారు. ఇక రెండో విషయానికి వస్తే.. ఐఏఎస్ అధికారిగా ఉంటూ కూడా అధికారిక కార్యక్రమాల్లోనే సీఎం జగన్ ను ఆకాశానికెత్తేస్తూ విజయ్ కుమార్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ రెండు కారణాల వల్ల విజయ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఐఏఎస్ నోట పొలిటికల్ కామెంట్స్
ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న విజయ్ కుమార్.. గురువారం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో భాగంగా జగన్ మొక్కలు నాటితే.. ఈయన మాత్రం జగన్ ను ఆకాశానికెత్తేసి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ప్రసంగం ఎలా సాగిందంటే.. ‘‘నిధులు లేకపోయినా ఇచ్చిన మాటకు జగన్ కట్టుబడి ఉన్నారు. అనుకున్న సమయానికి అన్ని పళథకాలను జగన్ అమలు చేస్తున్నారు’’ అంటూ విజయ్ కుమార్ తన స్వామి భక్తిని చాటుకున్నారు. అయినా అధి అధికారిక కార్యక్రమన్న విషయాన్ని కూడా విజయ్ కుమార్ మరిచిపోయినట్లున్నారు. అధికారిక కార్యక్రమంలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్య అధికారిగా ఉన్న విజయ్ కుమార్.. ఏకంగా వేదిక నుంచే రాజకీయ ప్రసంగం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్‌పై స్తుతి గీతం
ఇలా ఓ ఐఏఎస్ అధికారి హోదాలో ఉంటూనే అధికారిక కార్యక్రమాల్లోనే జగన్ ను విజయ్ కుమార్ ఆకాశానికెత్తేస్తూ వైసీపీ నేతగా వ్యవహరించిన వైనం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా ఏకంగా జగన్ కీర్తి ప్రతిష్ఠలను చాటుతూ ఏకంగా ఓ పాటనే పాడిన విజయ్ కుమార్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. నాడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అసలు వాటిని తాను పట్టించుకోనన్న చందంగా విజయ్ కుమార్ వ్యవహరించారు. తానో అధికారినని, జగన్ ఓ రాజకీయ నాయకుడన్న విషయాన్నే మరిచిన విజయ్ కుమార్.. సమయం, సందర్భం అన్న తేడా లేకుండా నిత్యం జగన్ నామస్మరణలో తరించిపోతున్న వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. ఇక ఐఏఎస్ పదవి ఎందుకు స్వామీ.. దానికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోతే మరింత మేర జగన్ కు స్తుతి గీతాలు పాడుకోవచ్చు కదా అన్న దిశగా ఆయనపై సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే










