Non Bailable Warrant To Ex Collector of Krishna District MD Intiaz :
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అంతా అయోమయంగా సాగుతున్న వైనం చాలా స్పష్టంగానే తెలిసిపోతోంది. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, కోర్టులను, అవి ఇచ్చే తీర్పులను లెక్క చేయకపోవడం, కేంద్రం విధివిధానాలను ఏమాత్రం లెక్క చేయకపోవడం.. తదితర పరిణామాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో జగన్ తో మైత్రి కారణంగా కేంద్రం పెద్దలు జగన్ ను పెద్దగా ప్రశ్నించకున్నా.. కోర్టులు మాత్రం ఎప్పటికప్పుడు జగన్ సర్కారుకు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఇందులో భాగంగా ఇటీవలే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లకు జైలు శిక్షను విదిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. తాజాగా మరో ఐఏఎస్ అధికారికి హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
మొన్నటిదాకా కృష్ణా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ప్రస్తుతం మైనారిటీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా ఇటీవలే బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో ఇంతియాజ్ పై ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని తమకు వర్తింపజేయలేదంటూ జిల్లాలోని చందర్లపాడుకు చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గతేడాది అక్టోబరు 22న వారికి పథకాన్ని అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అయితే, అధికారులు 2020-21 సంవత్సరానికి సంబంధించి మాత్రమే నిధులు మంజూరు చేసి, అంతకుముందు ఏడాది నిధులు విడుదల చేయలేదట. దీనిపై బాధితులు వారిపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విషయం తెలిసిన అధికారులు ఇటీవల ఆ నిధులు కూడా విడుదల చేశారు. ఇంతదాకా బాగానే ఉన్నా.. బుధవారం జరిగిన కోర్టు ధిక్కరణ విచారణకు ఇంతియాజ్, డీఆర్‌డీఏ పీవోలతోపాటు వారి తరపు న్యాయవాదులూ కోర్టుకు గైర్హాజరయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇంతియాజ్, డీఆర్డీఏ పీడీలను అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపరచాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.
ఇంతియాజ్ అరెస్ట్ తప్పదు
ఈ కేసు విచారణను పరిశీలించినా.. కోర్టుల పట్ల, కోర్టుల్లో జరిగే విచారణల పట్ల ఏ మేర శ్రద్ధ చూపిస్తున్నదో ఇట్టే అర్థమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైనా.. అది కూడా హైకోర్టులో దాకలైనా అధికారులు పట్టించుకోని తీరు చూస్తుంటే.. కోర్టుల పట్ల జగన్ సర్కారుకు గానీ, దాని కింద పనిచేస్తున్న అధికార యంత్రాంగానికి గానీ ఏమాత్రం గౌరవం గానీ, భయం గానీ లేవనే చెప్పాలి. అయితే ఈ తరహా వైఖరిని కోర్టులు క్షమించవు కదా. అందుకే.. ఇటీవలే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించి.. వాని విజ్ఞప్తి మేరకు ఓ రోజంతా కోర్టులోనే కూర్చునేలా శిక్షను మార్చేసిన హైకోర్టు తాజాగా ఇంతియాజ్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు అంటే.. ఇంతియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచడం ఖాయమే కదా. అంటే.. ఇంతియాజ్ అరెస్ట్ కాక తప్పదన్న మాట. ఈ ఘటన ఇప్పుడు ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేపుతోందనే చెప్నాలి.
Must Read ;- జగనొచ్చాడు.. ఐఏఎస్‌లు జైలుకెళుతున్నారు