ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన రాజకీయ ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి టీడీపీ, దాని అనుకూల మీడియా సంస్థలకు ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై నుంచే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ తరహాలో రాజకీయ ప్రత్యర్ధులను బెదిరింపులకు గురి చేసిన సీఎం ఎవరూ లేరనే చెప్పాలి. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో తాను అందరికంటే భిన్నమని, తనది పక్కా పగ, ప్రతీకారాలతో కూడిన పాలనేనని కూడా చెప్పినట్టైంది. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నింటినీ తవ్వి తీస్తానని, తప్పుందని తేలిన ఏ ఒక్కరిని వదిలేది లేదని కూడా జగన్ ప్రకటించారు. సరే.. సీఎం కుర్చీలో కూర్చున్నారు కదా.. జనం వ్యతిరేకించే దాకా ఏ పని చేసినా చెల్లిపోతుంది కదా. మరి సీఎం హోదాలో ఉండి చేసిన ఆరోపణలను నిజమని నిరూపించేందుకు సరైన సాధన సంపత్తిని జగన్ సమకూర్చుకోవాలి కదా. ఆ దిశగా జగన్ పెద్దగా వర్క్ చేసినట్టే లేరు.
ఈ రెండు కేసుల్లో అభాసుపాలు
జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఏపీ సీఐడీకి వరుసగా కేసుల దర్యాప్తులు అప్పగిస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక.. తొలుత ఆ శాఖకు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు దర్యాప్తును అప్పగించారు. అదే సమయంలో సీఐడీ చీఫ్ గా ఉన్న కుమార్ విశ్వజిత్ ను అక్కడి నుంచి బదిలీ చేసి సునీల్ కుమార్ ను ఆ పోస్టులో కూర్చోబెట్టారు. సునీల్ చేతగానితనమో, లేదంటే కేసులో బలమే లేదో గానీ.. ఇన్ సైడర్ కేసు అటు హైకోర్టులో నిలవలేదు. సుప్రీంకోర్టులోనూ నిలవలేదు. అంతేకాకుండా జగన్ సర్కారుపై రెండు కోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసలు ఫిర్యాదులు లేకుండా కేసుల దర్యాప్తు ఎలా సాగిస్తారంటూ కూడా కోర్టులు ప్రశ్నించాయి. బాధితులు లేకుండా నేరం జరిగిందని ఎలా చెబుతారంటూ కూడా అక్షింతలు వేశాయి. ఇక ఆ తర్వాత వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ విషయంలో జగన్ ను, ఆయన సర్కారును సీఐడీ ఏ రీతిన అభాసుపాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీఐడీ అదుపులోనే ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరగడం, దానిని కోర్టులోనే రఘురామ బయటపెట్టడం, దానిపై ఏకంగా సుప్రీంకోర్టుకు రఘురామ ఎక్కడం.. తదితరాలతో సీఐడీ పరువు గంగలో కలిసిపోయింది. జగన్ పరువునూ బజారుకీడ్చిందన్న వాదనలూ లేకపోలేదు.
జయభేరీ కేసులో ఎదురుదెబ్బ
ఇక తాజాగా బుధవారం నాడు రెండు కీలకమైన వ్యవహారాల్లో సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమయ్యాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, జయభేరీ ప్రాపర్టీస్ చైర్మన్ మురళీమోహన్ పై కేసు నమోదు చేసిన సీఐడీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మురళీమోహన్ తన వద్ద స్థలం తీసుకుని మోసం చేశారన్న భూ యజమాని ఫిర్యాదు మేరకు 41-ఎ కింద మురళీమోహన్‌తోపాటు జయభేరీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందిగా వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై జయభేరీ డైరెక్టర్లు మురళీమోహన్, కిశోర్ దుగ్గిరాల, ఎం.రామ్మోహన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా మురళీమోహన్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. భూ యజమాని ఆరోపిస్తున్నట్టు ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు లేవన్నారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మారుస్తున్నారని ఆరోపించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఇక జగన్ కుటుంబంపై అనుచిత పోస్టులు పెట్టారన్న కారణంతో టీడీపీకి చెందిన జ్యోతిశ్రీని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్న సీఐడీ.. మంగళవారం రాత్రి కూడా తన కార్యాలయంలోనే నిర్బంధించింది. ఓ మహిళను కోర్టులో హాజరుపరచకుండా స్టేషన్ లో ఎలా ఉంచుతారంటూ పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆమెను బుధవారం విడిచిపెట్టాల్సి వచ్చింది. మొత్తంగా ఏపీ సీఐడీ ఏ కేసు చేపట్టినా.. జగన్ సర్కారుకు ఎదురు దెబ్బలు తగులుతున్న వైనంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- ఓటమి దిశగా వైసీపీ.. తేల్చేసిన జగన్ సర్వే










