AP Denies Justice N V Ramana Suggestion :
వివాదం ఏదైనా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడమనేది ఉత్తమ మార్గం. పలితంగా వ్యయ ప్రయాసలు లేకుండా.. ప్రభుత్వం గానీ, ప్రైవేటు సంస్థలు గానీ, వ్యక్తులు గానీ వివాదాలను పరిష్కరించుకునే వీలుంది. ఈ మార్గమే ఉత్తమని దేశంలోని కింది స్థాయి కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. కేవలం మాట మాత్రంగా చెప్పడమే కాకుండా.. ఏకంగా జిల్లాల్లో న్యాయ సేవాధికార సంస్థలను కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇంతటి ఉత్తమ మార్గాన్ని పాటించాలని మరోమారు స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన సలహాలను ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారు పాటించబోమని తేల్చి చెప్పింది. మొత్తంగా ఏ వివాదమైనా వ్యయ ప్రయాలసతో కూడుకున్న కోర్టుల విచారణ ద్వారానే తేల్చుకుంటామని కూడా నిర్ద్వంద్వంగా చెప్పింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు సరికొత్త చర్చకు తెర లేసిందనే చెప్పాలి.
కృష్టా జలాల వివాదంపై జస్టిస్ రమణ సలహా
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలకు సంబంధించి పెను వివాదమే నడుస్తోంది. ఈ వివాదాన్నే ప్రారంభించింది తెలంగాణనే అయినా.. దానికి బీజం వేసింది మాత్రం ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారే. కర్నూలు జిల్లా పరిధిలోని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని డబుల్ చేస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఇందుకు కేంద్రం అనుమతి గానీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి గానీ తీసుకోకుండానే పనులు మొదలుపెట్టేసింది. పోతిరెడ్డిపాడుపై ఆది నుంచి నిరసనలే వ్యక్తం చేస్తున్న తెలంగాణ.. ఆ ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచుతామంటే చూస్తూ ఊరుకోదు కదా. అందుకే సీమ ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరం చెప్పింది. వెరసి ఈ ప్రాజెక్టు కేంద్రంగా ఇరు రాష్ట్రాలు దాదాపుగా పోట్లాడుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జలాల వివాదంపై జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకే విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు ఓ మంచి సలహా ఇచ్చారు. ‘‘కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే సరిపోతుంది కదా. మీరు మీ మీ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ విషయం చెప్పండి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చూడండి. నేను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడిని. మధ్యవర్తిత్వానికి ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే మంచిది. లేదూ.. కోర్టుల ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామంటే.. పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేస్తాను’’ అని జస్టిస్ రమణ సూచించారు.
ఏపీది మొండి వైఖరేనా..?
ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా ప్రభుత్వాల న్యాయవాదులు జస్టిస్ ఎన్వీ రమణ సలహాను వివరించారు. ఈ విషయంపై తెలంగాణ ఏమన్నదో తెలియదు గానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం జస్టిస్ ఎన్వీ రమణ సలహాను పాటించేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా లేమని, కోర్టుల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని తేల్చేసింది. ఇదే విషయాన్ని బుధవారం నాటి విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేస్తున్నట్లుగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. అయితే అక్కడే ఉన్న కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కలగజేసుకుని.. ఈ పిటిషన్ ను సీజేఐ నేతృత్వంలోని బెంచే విచారించాలని కోరారు. అందుకు ససేమిరా అన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని, ఈ పిటిషన్ ను తన ఆధ్వర్యంలోని బెంచ్ విచారించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొత్తంగా కోర్టు విచారణలతోనే తేల్చుకుంటామన్న ఏపీ ప్రభుత్వ మొండి వైఖరితో పిటిషన్ మరో బెంచికి బదిలీ అయిపోయింది. మరి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే