బాక్సాఫీసు రికార్డులు.. ఈ మాటను మనం ఇక మరచిపోక తప్పదేమో. ఎందుకంటే థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. రాబోయే కాలమంతా ఓటీటీల హవానే కనిపించేలా ఉంది. తమ సినిమా ఎన్ని స్క్రీన్ ల మీద రిలీజైతే అంతగొప్పగా సినీ జనులు భావించేవారు. ఎన్టీఆర్, ఏయన్నార్ ల హయాంలో 28, 30 థియేటర్లలో సినిమా విడుదలైతే గొప్పగా భావించేవారు. ఆ తర్వాత థియేటర్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోయింది. ఏ సినిమా ఎంత కలెక్షన్లు వసూలు చేసింది అనేది కూడా ఓ రికార్డుగా భావించేవారు. థియేటర్ల సంఖ్య కరోనా ముందు వరకూ వెయ్యి థియేటర్లు దాటిపోయింది. ఇప్పుడు ఓటీటీ వచ్చాక ఇక లెక్కేముంటుంది. ఏ సినిమా ఎంత వసూలు చేసిందో ఎవరికీ తెలియదు. స్టార్ హీరోల ముందు నుంచి కలెక్షన్ల వసూళ్లు అనే మాట చెరిగిపోయినట్లే. మళ్లీ థియేటర్లు ప్రారంభమైనా ఇది కొంతకాలమే ఉంటుందేమో అనిపిస్తోంది.
కలెక్షన్ల రికార్డులు ఎంతవరకు ప్రామాణికం?
సినిమా వసూళ్లను ప్రాతి పదికగా తీసుకోవడం కూడా తప్పే. ప్రస్తుతం ఈ రికార్డు బాహుబలి, నాన్ బాహుబలి అనే పేరుతో కొనసాగుతోంది. ఇప్పట్లో మాత్రం ఈ రికార్డుకు దరిదాపులకు కూడా చేరుకోవడం కష్టమే. కానీ అది ఎంతో కాలం పట్టదు. ఎందుకంటే ఒక సినిమా స్టామినాను నిరూపించడానికి కలెక్షన్ల వసూళ్లు ప్రామాణికం కాదు. ఎంత మంది ఆ సినిమాను చూశారన్నదే ముఖ్యం. దీనికి ప్రధాన కారణం టిక్కెట్ ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు. పావలా పెట్టి సినిమాలు చూసిన రోజులూ ఉన్నాయి.. 200 రూపాయలు పెట్టి చూస్తున్న రోజులూ వచ్చాయి.
ఓటీటీ వచ్చాక ఈ లెక్కను ఎలా నిర్ణయిస్తారు? రికార్డులను నిర్ణయించాలంటే ఆ సినిమాని ఎంతమంది చూశారన్నదే ముఖ్యం. ఒక విధంగా ఇది బాహుబలికి కూడా వర్తించకపోవచ్చు. విజయచందర్ తెరకెక్కించిన ‘కరుణామయుడు’ సినిమా ఎన్ని భాషల్లోకి అనువాదమైందో చెప్పలేం. క్రిస్టియానిటీ బలంగా ఉన్న ప్రతిచోటా ఆయా భాషల్లోకి అనువాదమైన చిత్రమది. ఆ లెక్కన చూస్తే బాహుబలిని చూసిన వారికన్నా కరుణామయుడు చూసినవారే ఎక్కువగా ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నదేమంటే సినిమా క్వాలిటీ మీద దృష్టి పెట్టడం మంచిదే. కానీ కలెక్షన్ల వసూళ్ల మీద దృష్టిపెట్టకపోవడమే మంచిది.
తెలుగు సినిమాల్లో క్వాలిటీ పరంగా బాహుబలి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆ టెక్నాలజీ పాత రోజుల్లో ఉంటే మన పాతాళభైరవి, మాయాబజార్ లు కూడా పాన్ ఇండియా సినిమాలుగా మారి ఉండేవి. కలెక్షన్ల వసూళ్ల వల్ల వస్తున్న ఇబ్బంది ఏమిటంటే ఎంతబాగా సినిమా ఇచ్చాం అని కాకుండా మన సినిమా ఎంత వసూళ్లు సాధించింది అన్నదాని గురించే అటు హీరోలు, ఇటు దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయినా మన సినిమా ఇంత వసూళ్లు సాధించిందని ఆ హీరో చంకలు గుద్దు కోవాలా? ఇదీ మన స్టార్‌డమ్ మహిమ అంటూ జబ్బలు చరుచుకోవాలా? అన్నవి మన ముందున్న ప్రశ్నలు.
అసలు ఈ డబ్బంతా ఎవరిది అని ప్రశ్నించుకుంటే మాత్రం ఇబ్బందులే. అరచేతిలో వైకుంఠం చూపించి జనం డబ్బును లాక్కున్నట్టే అవుతుంది. నాకింత.. నీకెంత ? అని ఆలోచించుకునే ముందు అసలు ప్రేక్షుడికి సరైన సినిమా ఇవ్వడానికి మనం చేసిన కృషి ఎంత అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే రూపాయిలో ఐదు పైసలు తిరిగి ఇచ్చేద్దాం అనే సంస్కృతి కూడా వచ్చేసింది. ఇలా ఇవ్వడానికి కూడా ఏ రజనీకాంతో, పవన్ కళ్యాణో ఒప్పుకుంటున్నారుగానీ మిగతావారు మాత్రం నోరు విప్పడం లేదు. సినిమాను హైప్ చేసి డబ్బులు లాగేసుకోవడం తప్పిదమే అవుతుంది.











