గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎప్పుడూ తన రూపాన్ని మారుస్తూనే ఉంటారు. ఓ సారి లాల్చీ పైజామా వేసుకుని బయటకు వస్తే.. మరో సారి జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ లలో కనిపిస్తారు. ఇంకోసారేమో.. జుట్టు పెంచుకుని, గడ్డం కూడా గీసుకోకుండా కాస్తంత ఫేడ్ అవుట్ అయినట్టుగా కనిపిస్తారు. వెరసి రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ లుక్కులో కనిపిస్తారో ఏ ఒక్కరూ చెప్పలేరు. స్వయంగా ఆయన బాడీ గార్డ్స్ కూడా ఈ రోజు రాహుల్ ఈ అవతారంలోనే వస్తారు అని చెప్పలేరు. నిత్య నూతనంగా ఉండాలని కోరుకుంటారో, ఏమో తెలియదు గానీ.. రాహుల్ గాంధీ తన స్టైల్ ను నిత్యం మారుస్తూనే ఉంటారు.
టక్ లో రాహుల్ అదుర్స్
ఇప్పుడు మన తెలుగు హీరో నాని టక్ జగదీశ్ పేరిట ఓ సినిమా చేస్తున్నాడు కదా.. ఆ సినిమా పోస్టర్లు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమా టైటిల్ ను ఠక్కున గుర్తుకు తెచ్చేలా రాహుల్ గాంధీ.. నీట్ గా టక్ చేసుకుని తన ఇంటి బయటకు వచ్చారు. నరేంద్ర మోదీ సర్కారు అవంబిస్తున్న డిజిన్వెస్ట్ మెంట్ పై మీడియాతో మాట్లాడేందుకు తన ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరిన రాహుల్ గాంధీ.. తన ఇంటి నుంచి బయటకు రాగానే.. మీడియా ప్రతినిధులను అమితంగా ఆకట్టుకున్నారు. బ్లూ హాఫ్ హ్యాండ్ షర్ట్ ను నీట్ గా టక్ చేసుకుని కనిపించిన రాహుల్.. తన టక్ ను అలా అలా సర్దుకుంటూ ముందుకు వచ్చారు. పార్టీ సీనియర్లు పి.చిదంబరం, రుణదీప్ సూర్జేవాలాలు తన వెనుక రాగా.. వారిలో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చిన రాహుల్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.
Must Read ;- రాహుల్ లాజిక్ భలే పేలిందబ్బా











