బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సర్కారీ ఆస్తులను ప్రోది చేసే పని అటకెక్కింది. అదే సమయంలో అప్పటికే సర్కారీ ఆస్తులుగా ఉన్న పలు సంస్థలు ప్రైవేటు పరం అయిపోయాయి. ఇందులో భాగంగానే కొత్తగా విశాఖలోని ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం అయ్యే దిశగా వడివడిగానే అడుగులు పడుతున్నాయి. త్వరలోనే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మోదీ సర్కారు.. మరిన్ని ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి సిద్ధమైపోయింది. రూ.6 లక్షల కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని పలు కీలక ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమైపోయింది. ఈ వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
డిజిన్వెస్ట్ మెంట్ ఆగదంతే
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు పాలన మొదలయ్యాక.. పెట్టుబడుల ఉపసంహరణకు మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. అంతకుముందు యూపీఏ సర్కారు కూడా పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపినా.. ప్రజా వ్యతిరేకత వస్తుందన్న కారణంగా ఎప్పటికప్పుడు దానిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే మోదీ ప్రధాని అయ్యాక.. ప్రజా వ్యతిరేకత అన్న మాటే వినిపించడం లేదు. అంతేకాకుండా వరుసగా రెండో సారి కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ.. మిత్రపక్షాల అవసరం కూడా తనకు లేదన్నట్లుగా వ్యవహరించడం మొదలెట్టారు. ఫలితంగా మోదీ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా ప్రజా వ్యతిరేకత భారీగానే వెల్లువెత్తుతోంది. అయినా కూడా మోదీ సర్కారు తనదైన శైలి నిర్ణయాల అమలులో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ క్రమంలోనే పెట్టుబడుల ఉపసంహరణపై తనదైన శైలి స్పీడుతో సాగుతున్న మోదీ సర్కారు.. ఆ దిశగా ఇప్పుడు మరింత వేగం పెంచిందనే చెప్పాలి.
రోడ్లనూ అమ్మేస్తారా?
ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఏకంగా రూ.6 లక్షల కోట్లను సమీకరించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఏఏ రంగాల్లో పెట్టుబడులను ఉపసంహరించవచ్చు.. వాటితో ఏ మేర నిధులు సమకూరతాయి.. అన్న దిశగా మదింపు మొదలైందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రూ.6 లక్షల నిధుల కోసం.. దేశంలోని పలు రహదారులను, విమానాశ్రయాలను, విద్యుత్ పైప్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లను కూడా ప్రైవేటుపరం చేసే దిశగా మోదీ సర్కారు కదులుతోందట. రక్షణ రంగం మాదిరి కీలక రంగాలను వదిలేసి మిగిలిన అన్ని రంగాల్లోనూ డిజిన్వెస్ట్ మెంట్ ను అమలు చేయాలన్న దిశగా మోదీ సర్కారు కదులుతోందట. ఈ మేరకు మోదీ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నారట. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే.. ఇక దేశంలోని ప్రతి రహదారిపైనా జనం టోల్ ట్యాక్స్ చెల్లించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ఏపీలో గురువు.. తెలంగాణలో శిష్యుడు











