2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ విక్టరీ కొట్టి ఉంటే.. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పీఠంపై కూర్చునే వారే. 2019 ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే.. ఆయనే ప్రధాని అయ్యేవారు. 2014లో ఓ మోస్తరుగానే ఇంటరెస్ట్ చూపించిన రాహుల్.. 2019 ఎన్నికలను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే 2014 కంటే కూడా 2019లోనే కాంగ్రెస్ కు ఎక్కువ నష్టం కలిగింది. స్వయంగా రాహుల్ గాంధీనే తన సొంత నియోజకవర్గం అమేథీలో ఓటమిపాలయ్యారు. ఏదో కేరళలోని వయనాడ్ లో రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయబట్టి సరిపోయింది గానీ.. లేదంటే ఇప్పుడు ఆయన లోక్ సభలోకి కూడా అడుగుపెట్టేవారు కాదు. ఇంతటి కీలకమైన నేత మీడియా ముందుకు రావాలంటేనే ఎందుకనో గానీ బాగా జంకుతారు. అసలు మీడియా సమావేశాలంటేనే ఆయన ఆసక్తి చూపరు. అయితే పరిస్థితి మారింది. రాహుల్ గేర్ మార్చారు. మోదీ సర్కారుపై ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతన్న వైనాన్ని తనకు అనుకూలంగా మలచుకునే దిశగా రాహుల్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తాజాగా మంగళవారం నాడు ఆయన నిర్వహించిన మీడియా మీట్ లో తనదైన శైలి లాజిక్ ను ప్రయోగించిన రాహుల్ గాంధీ.. మీడియా ప్రతినిధులే ఆశ్చర్యపోయేలా వ్యవహరించారు.
డిజిన్వెస్ట్ మెంట్ పై గురి
ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన నరేంద్ర మోదీ సర్కారు కొత్తగా రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్లను ప్రైవేటు నిర్వహణకు అప్పగించేందుకు నిర్ణయించింది. కొత్తగా రూ.6 లక్షల కోట్లను వీటి ద్వారా సమీకరించాలని కూడా తీర్మానించారు. దీనిపై సోమవారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దీనిపై రాహుల్ చాలా వేగంగానే స్పందించారు. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి యూపీఏ అనుసరించిన వ్యూహాన్ని చెబుతూ.. ఇప్పుడు అదే విషయంపై మోదీ సర్కారు చేస్తున్నది ముమ్మాటికీ తప్పేనని చెప్పేందుకు రాహుల్ గాంధీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం సహా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రణదీప్ సూర్జేవాలాతో పాటు మరో సీనియర్ నేతతో కలిసి వచ్చిన రాహుల్.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎంతమాత్రం తడబాటు లేకుండానే క్లిస్టర్ క్లియర్ గా సమాధానాలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాహుల్ లాజిక్ ఏమిటంటే..?
పెట్టుబడుల ఉపసంహరణను వాస్తవానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారే మొదలెట్టేసింది. అయితే ఎక్కడ ప్రజా వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో సాగిన మన్మోహన్.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లోనే పెట్టుబడులను ఉపసంహరించారు. ఈ కారణంగానే యూపీఏ డిజిన్వెస్ట్ మెంట్ పై ప్రజల్లో వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాహుల్.. పెట్టుబడుల ఉపసంహరణకు తాము వ్యతిరేకమేమీ కాదనే చెప్పారు. అదే సమయంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లోనే పెట్టుబడులను ఉపసంహరించామని చెప్పారు. అంతేకాకుండా రైల్వేల్లాంటి ప్రాధాన్యం కలిగిన రంగాల్లో అసలు పెట్టుబడుల ఉపసంహరణ అన్న మాటే లేకుండా సాగామన్నారు. అందుకు విరుద్ధంగా సాగుతున్న మోదీ సర్కారు.. ప్రాధాన్య రంగాలైన రైల్వేలు, రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్లలో పెట్టుబడులను ఉపసంహరించడం సరికాదన్నారు. ఈ చర్యల ద్వారా మోదీ బాధ్యత కలిగిన ప్రధానిగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ అసలు ప్రధానే కాదని కూడా రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించే నేతగా మోదీ అపప్రదను మూటగట్టుకున్నారని ఆరోపించారు. మొత్తంగా ఈ లాజిక్ తో రాహుల్ మునుపెన్నడూ లేని రీతిలో పరిణతి కనబరచారు.
Must Read ;- 6 లక్షల కోట్లు కావాలి!.. ఏమేం అమ్మాలి?











