రాజకీయాలన్నాక.. చెప్పిన మాట చేయరాదు. చేయనున్న పనిని చెప్పరాదు. ముందోక మాట.. వెనకొక మాట. పొరపాటున నోరు జారినా ఏమాత్రం వెనక్కు తీసుకోరాదు. అలా తీసుకుంటే ఆ నేత పరువు గంగలో కలిసినట్టే. ఇదీ ప్రస్తుతం మన రాజకీయ నేతలను చూస్తే అనిపించే మాటలు. అయితే ఇలాంటి రాజకీయాలకు తాను కాస్తంత భిన్నమేనని టీఆర్ఎస్ కార్యాధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిరూపించారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే పోయేదేముంది.. ఇంకా మన గౌరవమే పెరుగుతుంది కదా అన్నట్లుగా ఆయన సాగుతున్నారు. అంటే.. ఏదో కారణం చేత తాను తప్పు చేసినా.. దానిని ఒప్పేసుకుని క్షమాపణలు చెప్పేందుకు కేటీఆర్ కు ఏమాత్రం బేషజాలు లేవన్న మాట. ఇప్పటికే ఈ తరహాలో పలుమార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన కేటీఆర్.. తాజాగా మరోమారు అదే తరహా పని చేసి ఆదర్శంగా నిలిచారు.
పట్టిస్తే రూ.10 లక్షలు
హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఇంటి పక్కనే ఉన్న రాజు అనే మృగాడు ఆ బాలికను హత్య చేశాడని తేలిపోయింది. ఈ ఘటన ప్రకంపనలు రేపింది. ఘటన జరిగిన నాడే నిందితుడి ఇంటిని చుట్టుముట్టిన స్థానికులు నిందితుడిని చంపేస్తామంటూ ఊగిపోయారు. అయితే ఆ తర్వాత పోలీసులు ఆందోళనలను అదుపులోకి తీసుకొచ్చి నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈలోగానే నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. ఇప్పుడు అతడి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. 10 పోలీసు బృందాలు రంగంలోకి దిగగా.. వందలాది మంది పోలీసులు అతడి ఫొటో పట్టుకుని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయినా అతడు ఎక్కడున్నాడన్న విషయం ఇప్పటికీ తేలలేదు. తాజాగా అతడిని పట్టిస్తే.. రూ.10 లక్షల నజరానా ఇస్తామంటూ పోలీసులు ప్రకటించారు.
అరెస్ట్ చేశామన్నది పొరపాటు
ఇదిలా ఉంటే.. ఘటన జరిగిన మరునాడే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు. ఆరేళ్ల బాలికపై హత్యాచారాన్ని ఖండించిన కేటీఆర్.. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారని, అతడిపై చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీలు చర్యలు తీసుకుంటున్నారని కూడా పేర్కొన్నారు. నిందితుడు అరెస్ట్ కాకుండానే అరెస్టైనట్లు తాను చేసిన ట్వీట్ ను నిజంగానే కేటీఆర్ మరిచిపోయినట్టున్నారు. అయితే మంగళవారం నాడు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నజరానా ప్రకటించిన తర్వాత గానీ ఆ ట్వీట్ కేటీఆర్ కు గుర్తుకు రాలేదు. వెనువెంటనే స్పందించిన కేటీఆర్.. తన పాత ట్వీట్ ను మరోమారు ప్రస్తావిస్తూ మంగళవారం నాడు నిందితుడి అరెస్ట్ విషయంలో తాను పొరబడ్డానని, నిందితుడు అరెస్ట్ కాకుండానే.. అరెస్ట్ అయినట్టుగా తాను పేర్కొన్నానని, తనకు సరైన సమాచారం రాని కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తాజాగా ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా పొరపాటుకు చింతిస్తున్నానని కూడా కేటీఆర్ ఏమాత్రం బేషజం లేకుండానే తన తప్పును ఒప్పేసుకున్నారు.
Must Read ;- కమాన్ బండి.. కేటీఆర్ రిజైన్ చేస్తారట











