పెద్ద సినిమాలకు మంచి రోజులొచ్చేశాయి. పాన్ ఇండియా సినిమాల విడుదల జనవరికి వాయిదా పడినా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా దసరా, దీపావళి టార్గెట్ గా ఈ సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. అయితే అంతకుముందు సినీ పెద్దలు ప్రభుత్వంతో జరిగే చర్చలు ఎంతకు ఫలవంతమవుతాయో చూడాలి. ప్రధానంగా టిక్కెట్ ధర పెంచుకునేందుకు అనుమతి కోరుతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే పెద్ద సినిమాల విడుదల అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుంది.
అందులో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, గోపీచంద్ పక్కా కమర్షియల్ అక్టోబరు 1న విడుదలవుతాయి. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అక్టోబరు 8న విడుదల కాబోతోంది. ముఖ్యంగా దసరాతో సందడి మొదలవుతుందని అనుకోవాలి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన ‘అఖండ’ సినిమా దసరాకు విడుదల కానున్నట్టు వార్తలందుతున్నాయి. ఇవి కాకుండా విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 కూడా ఈ దసరాకే విడుదల కానుంది. మొదట ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేయాలనుకున్నారు.
ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కూడా దసరాకే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దీపావళి విషయానికి వస్తే మొత్తం మూడు సినిమాలు బరిలో నిలిచే అవకాశం ఉంది. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ ‘గని’. మిగిలిన రెండు సినిమాలు రజినీకాంత్ అణ్ణత్తే, ఇంకోటి అజిత్ ‘వాలిమై’. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు బరిలో నిలిచే అవకాశం ఉంది. రజినీ, అజిత్ చిత్రాల మధ్య పోటీ తమిళనాట మాత్రం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
వీరిద్దరి సినిమాలు పోటీ పడటం ఇది మొదటిసారి కాదు. గతంలో పేట, విశ్వాసం చిత్రాలు కూడా దీపావళికే విడులయ్యాయి. వాటిలో శివ దర్శకత్వం వహించిన విశ్వాసం మంచి హిట్ కొట్టింది. ఈసారి శివ అణ్ణత్తే కి దర్శకత్వం వహించారు. వాలిమైకి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ రెండూ భారీ చిత్రాలుగా చెప్పాలి. ఈ రెండింటిలో అణ్ణత్తే నవంబరు 4న విడుదవుతుందని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. వాలిమై నిర్మాత బోనీకపూర్ దీపావళిని టార్గెట్ చేశారు.
ఈ సినిమాలే కాకుండా తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటిపై నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నిజానికి దసరాకు రాజమౌళి ట్రిపుల్ ఆర్ విడుదల కావాలి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయిందని అంటున్నారు. కాకపోతే పాన్ ఇండియా సినిమాల విడుదల అనివార్యం. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో థియేటర్లు ప్రారంభం కాకపోవడమే కారణం. అందువల్ల ఇలాంటి చిత్రాలన్నీ జనవరిని టార్గెట్ చేశాయి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా అనివార్యమా?











