భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్)లు ఆగర్భ శత్రువుల కిందే లెక్క. దేశంలో ఏ రెండు రాజకీయ పార్టీల మధ్య అయినా పొత్తు కుదరవచ్చేమో గానీ.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అనే మాటే ఊహకు అందదు. హిందూత్వ వాదనతో బీజేపీ సాగుతుంటే.. హిందూత్వ వాదనను వ్యతిరేకిస్తూ మజ్లిస్ సాగుతోంది. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ అన్నా, బీజేపీకి చెందిన ఏ చోటామోటా నేత అన్నాకూడా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి పడదు. అదే సమయంలో ఓవైసీ అంటే బీజేపీకి చెందిన ప్రతి నేతా వ్యతిరేకమే. వెరసి ఈ రెండు పార్టీల మధ్య నిత్యం అగ్గి రాజుకుంటూనే ఉంది. అయితే త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బయటకు పోట్లాడుతున్నట్లుగానే కనిపించినా.. లోలోపల మాత్రం ఓ అండర్‌స్టాండింగ్ తో కలిసి సాగే దిశగా ఓ అవగాహనకు వచ్చాయట. ఈ తరహా విశ్లేషణను వినేందుకు కూడా మెజారిటీ వర్గాలు సమ్మతించరు. అయితే అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇటీవలి కేసీఆర్ ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా హైదరాబాద్ పర్యటనలను తరచి చూస్తే.. ఈ విశ్లేషణను కొట్టిపారేయలేమనే చెప్పాలి.
మజ్లిస్ పోటీతోనే బీజేపీకి గెలుపు
రాజకీయాల్లో హైదరాబాద్ పాతబస్తీ పహిల్వాన్ గా పేరుగాంచిన మజ్లిస్ పార్టీ గడచిన కొన్నేళ్లుగా తెలుగు నేలలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల ఎన్నికల్లోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల విషయంలో అంతగా రాణించలేకున్నా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మజ్లిస్ సత్తా చాటింది. ఇతర రాష్ట్రాల్లోనూ విజయం సాధించలేకున్నా.. తన ఓటింగ్ శాతాన్ని మాత్రం క్రమంగా పెంచుకుంటోంది. వెరసి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న మజ్లిస్ వ్యవస్థాపకుడు, అసద్ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ కలను సాకారం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ కు దక్కిన ఓట్లతో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ మరోమారు అధికారం చేపట్టింది. అంటే.. బీహార్ లో మళ్లీ సత్తా చాటి అధికారం కైవసం చేసుకునే దిశగా సాగిన ఆర్జేడీ ఓట్లను చీల్చిన మజ్లిస్.. ఆర్జేడీకి నష్టం చేకూర్చి జేడీయూకు అధికారం దక్కేలా చేసిందన్న మాట. ఇదే ఫార్మ్యూలా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలయ్యేలా బీజేపీ వ్యూహం రచించిందట. ఈ కారణంగానే మజ్లిస్ తో మంచి దోస్తానా సాగిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడగంగానే.. ప్రధాని మోదీ సహా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు కూడా వరుసగా అపాయింట్ మెంట్లు ఇచ్చేశారట. ఈ భేటీల్లో తెలంగాణ సమస్యలను ఓపిగ్గా విన్న కమలనాథులు.. తమ వ్యూహం అమలు బాధ్యతను కేసీఆర్ కు అప్పగించారట.
యూపీలో వంద సీట్లలో మజ్లిస్
అసలు ఈ దిశగా బీజేపీ లెక్క ఏమిటంటే.. మజ్లిస్ పాక్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీలయినన్నిఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. ఇలా మజ్లిస్ పోటీ చేసిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలవకున్నా కనీసం ముస్లిం మైనారిటీ ఓట్లను వీలయినంత మేర చీల్చాలి. ఇదే జరిగితే.. అత్యధిక నష్టం యూపీలో విపక్ష పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీనే. ఎందుకంటే.. మైనారిటీ ఓట్లలో మెజారిటీ శాతం ఎస్పీకే పడతాయి కాబట్టి. ఈ లెక్కన ఎస్పీకి పడే మైనారిటీ ఓట్లలో ఓ పది శాతం ఓట్లను మజ్లిస్ చీలిస్తే.. బీజేపీ ఆయా స్థానాల్లో ఈజీగా గెలుస్తుంది. వెరసి మరోమారు యూపీ సీఎం పీఠం బీజేపీకే దక్కడం ఖాయమనే చెప్పాలి. ఇదే ప్లాన్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చిన కేసీఆర్‌తో గత వారం కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువ సీట్లలో మజ్లిస్ పోటీ చేయాలంటే.. ఆ పార్టీకి ఆర్థిక వనరులు అవసరం కదా. ఆ వనరులను మజ్లిస్ కు అందించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని, అందుకే ఆయనతో సింధియా ప్రత్యేకంగా భేటీ అయ్యారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరహా కొత్త మంత్రంపై ఇప్పుడు నిజంగానే ఆసక్తికర చర్చ సాగుతోంది.
Must Read ;- నాలుగో వికెట్ డౌన్.. బీజేపీలో ఏం జరుగుతోంది?