YSRCP Leader Krishnudu Arrested For Playing Poker :
ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఆ పార్టీకి చెందిన నేతలు పేట్రేగిపోతున్నారు. జగన్ సీఎంగా ఉన్న అటు ఏపీతో పాటుగా.. జగన్ పార్టీ పేరు చెప్పుకుని ఇటు తెలంగాణలోనూ వారు స్వైర విహారం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు. ఇప్పటికే ఏపీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని తన సొంత నియోజకవర్గం గుడివాడలో తన అనుచరులను భద్రతగా పెట్టి పేకాటను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు గతంలో కలకలం రేపాయి. కర్నూలు జిల్లాకు చెందిన మరో మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలోనూ పేకాట శిబిరాలు వెలుగు చూసిన వైనం.. ఆ మంత్రిగారిని అడ్డంగా బుక్ చేసి పారేసింది. ఈ వ్యవహారంలో స్వయంగా మంత్రి సోదరులకే పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా కలకలం రేపాయి. తాజాగా తెలంగాణలో పేకాడుతూ జగన్ పార్టీకి చెందిన కృష్ణుడు అడ్డంగా దొరికిపోయారు.
సినిమాల్లో ఉంటూనే వైసీపీ నేతగా..
సినిమాల్లో తొలుత కేరెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసి ఆ తర్వాత ఒకటి అరా సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కించుకున్న కృష్ణుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు కలిగిన నటుడి కిందే లెక్క. సినిమాల్లో అవకాశాలు తగ్గాయో.. లేక రాజకీయాలపై మమకారమో తెలియదు గానీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చేసిన జగన్ వైఎస్సీర్సీపీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి కృష్ణుడు చేరిపోయాడు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించలేదు గానీ.. వైసీపీ నేతగానే ఆయన కొనసాగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు సినీ ప్రముఖులను కూడా ఆయన జగన్ వద్దకు తీసుకువచ్చి పార్టీలో చేర్పించారు కూడా. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో కృష్ణుడు కూడా ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే జగన్ వద్దన్నారో.. కృష్ణుడే వద్దనుకున్నారో గానీ.. ఆయన ఎన్నికల్లో నిలబడలేదు.
పేకాటలో మునిగి.. పోలీసులకు దొరికి..
ఏపీలో జగన్ పాలన మొదలయ్యాక కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు. కారణమేమిటో తెలియదు గానీ.. జగన్ అంటే కృష్ణుడికి వల్లమాలిన అభిమానం. అయితే ఏనాడూ కృష్ణుడి రూపంలో జగన్ కు ఇబ్బంది కలగలేదు గానీ.. ఇప్పుడు మాత్రం పెద్ద మచ్చే పడిపోయింది. హైదరాబాద్ లో పేకాడుతున్న కృష్ణుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పరిసరాల్లోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడ దాడులు చేశారు. ఆ సమయంలో పేక ముక్కలు చేతబట్టుకున్న కృష్ణుడు వారి కంటబడ్డారు. ఆ వెంటనే పోలీసులు కృష్ణుడిని అరెస్ట్ చేశారు. కృష్ణుడితో పాటుగా పేకాట ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు, మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిపోయింది.
Must Read ;- అప్పులకు జగన్ చెప్పిన కారణాలివే