తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు ఎంతగా కలవరపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీకి చెందిన హీరో రవితేజతో పాటు హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ కేసు విచారణకు హాజరయ్యారు. ఇక మరికొందరు సినీ ప్రముఖులు కూడా నాడు ఈ కేసు విచారణకు హాజరైన వార్తలు రోజుల తరబడి కలకలం రేపాయి. ఇప్పుడు మరోమారు ఈ కేసు విచారణ మొదలు కాగా.. ఈసారి తెలంగాణ పోలీసులు కాకుండా నేరుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగిన వైనం మరింతగా కలవరపాటుకు గురి చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ కేసు విచారణకు మరోమారు హాజరయ్యేందుకు సినీ ప్రముఖులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుందనే చెప్పాలి. ఈ కేసులోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు కూడా సంబంధం ఉందన్న కోణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ కేసుతో కేటీఆర్ కు సంబంధం ఉందని రేవంత్ రెడ్డి నేరుగా వ్యాఖ్యలు చేయనప్పటికీ.. ఆ అర్థం వచ్చేలా ఓ చిన్న కామెంట్ వదిలారు. అదే ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది.
రేవంత్ ఏమన్నారంటే..?
డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఈడీ ఎంటర్ అయిన వైనంపై మాట్లాడిన సందర్భంగా రేవంత్ చాలానే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటని హైకోర్టు పదే పదే ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. నాలుగేళ్ల క్రితం ఈ కేసును డీల్ చేసిన ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ ఈ కేసును మధ్యలో వదిలేశారు. ఆయన్ను బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయంలో నేను హైకోర్టులో పిల్ దాఖలు చేశా. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ విచారణ జరపాలని కోరా. ఈ సంస్థలు తమకు కేసు విచారణలో సహకారం అందడం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యంతోనే ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చాయి. ఈ కేసులో ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితుల ప్రమేయం ఉందా? కేటీఆర్ రహస్యంగా గోవా ఎందుకు వెళ్లారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా ఈడీ నోటీసులు ఇవ్వదు. ఆర్థిక లావాదేవీలు ఏ రాష్ట్రం నుంచి జరిగాయనే అంశాలు విచారణలో బయటపడతాయి. కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరమేంటి? నేను ఎవరిపైనా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదు. రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనేదే నా ఆందోళన’’ అని రేవంత్ సంచలన వ్యాఖ్యలే చేశారు.
కేటీఆర్ గోవా వెళితే తప్పా..?
రేవంత్ మాట్లాడిన అన్ని అంశాలపైనా ఎవరికీ అభ్యంతరం లేదు గానీ.. ‘‘కేటీఆర్ రహస్యంగా గోవా ఎందుకు వెళ్లారు?’’ అని రేవంత్ రెడ్డి చేసిన సింగిల్ వ్యాఖ్యే ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. కేటీఆర్ గోవా టూర్ ను ప్రశ్నిస్తూనే.. తాను ఎవరిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం లేదని చెప్పడంతో.. రేవంత్ ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలకు అర్థమైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆధారాలు లేకుండా ఈడీ నోటీసులు ఇవ్వదంటూ రేవంత్ నోట వినిపించిన వ్యాఖ్యలు కూడా ఆలోచించదగ్గవే. అంతేకాకుండా కేటీఆర్ టూర్ అంశాన్ని ప్రస్తావించిన వెంటనే.. ఆర్థిక లావాదేవీలు ఏ రాష్ట్రం నుంచి జరిగాయన్నది విచారణలో బయటపడుతుందని, అయినా ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై విచారణ చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని కూడా రేవంత్ ప్రశ్నించి మరిన్ని అనుమానాలను రేకెత్తించారనే చెప్పాలి. ఇప్పటికే రేవంత దూకుడుపై టీఆర్ఎస్ ఓ రేంజి కోపంతో ఉంది. ఈ కోపాన్ని శుక్రవారం నాటి మీడియా సమావేశంలో కేటీఆర్ బయటపెట్టుకున్నారు కూడా. మరి ఇలాంటి నేపథ్యంలో డ్రగ్స్ కేసును ప్రస్తావిస్తూ.. దానితో కేటీఆర్ కు సంబంధం ఉందన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేసిన రేవంత్ పై టీఆర్ఎస్ ఎంతలా విరుచుకుపడుతుందో చూడాలి.
Must Read ;- రేవంత్ దెబ్బకు సోనియా శరణువేడారే