వరస నిరసనలతో దద్దరిల్లుతున్న విజయవాడ!
మొన్న పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ‘చలో విజయవాడ’ పేరుతో ఉద్యమిస్తే.. పోలీసులు కంట్రోల్ చెయ్యలేక చేతులెత్తేశారు. రెండు లక్షల మంది ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తే.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలాయి. మరోవైపు బెజవాడ ప్రధాన రహదారులు దద్దరిల్లిపోయింది. దీంతో కుటీల రాజకీయంతో ఉద్యోగ సంఘాలను విచ్ఛిన్నం చేసి, ఆ నిరసనలను చల్లార్చి, ఊపిరి పీల్చుకుంది ఏపీ ప్రభుత్వం! ఇదిలా ఉంటే జేఏసీ నేతల నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యవహిరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు పోరుపట్టారు. స్టీరింగ్ కమిటీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను తీవ్రంగా ఖండించి.. ఫ్యాప్టో ఆందోళనల బాట పట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ఫ్యాప్టో నేతృత్వంలో ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. బుధవారం ఎన్జీవో ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ మోడ్ లోకి వచ్చారు!
ఎన్జీవో హోం వద్ద కట్టుదిట్టమైన భద్రత!
ప్రభుత్వం ఫిక్స్ చేసి పీఆర్సీ తో ఒరిగేదేమి లేదని, తమకు చట్ట ప్రకారం మిశ్రా కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం తమకు పీఆర్సీ, ఇతర ప్రయోజనాలను అందజేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్టీరింగ్ కమిటీలో ఉన్న జేఏసీ నేతలు రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులకు అన్యాయం చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని గాంధీ నగర్ ఉన్న ఎన్జీవో హోం ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుతో ఒక్కసారి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్జీవో హోం కు వెళ్లే మార్గాలకు పోలీసులు బారికేడ్ల ను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ధర్నా చౌక్ లో అమరావతి కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. మరో వైపు కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఇలా విజయవాడ సిటీ నలు దిక్కుల నిరసనలతో హోరెత్తుతోంది. దీంతో అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా బెజవాడ మారుతోంది. నిత్యం ధర్నా చౌక్ నిరసనలు, ధర్నాలు, దీక్ష్లల పేరుతో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో తరచూ ఆందోళనకారుల నుంచి అనేక ఛాలెంజెస్ ను పోలీసు శాఖ ఎదుర్కొంటుంది!
Must Read:-అప్పు లేనిదే పూట గడవుదు..! మరో రూ. 27 వేల కోట్ల అప్పుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం!











