అన్ని ప్రేమలు ప్రేమలు కావు .. అన్ని ప్రేమలు పెళ్లిళ్లవరకూ వెళ్లవు. కానీ కొన్ని ప్రేమలు గెలుస్తాయి .. నిదర్శనంగా నిలుస్తాయి. అలా నిజమైన ప్రేమకు నిర్వచనమై నిలిచి .. అసలైన దాంపత్యానికి ఆదర్శంగా నిలిచిన జంటగా శ్రీకాంత్ – ఊహ కనిపిస్తారు. ప్రేమ రెండు మనసులకు సంబంధించినది .. పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించినది. అందువల్లనే ప్రేమకి పర్మిషన్ అవసరం లేకపోయినా, పెళ్లికి పెద్దల అనుమతి కావాలనే అంటారు. అలా తమ ప్రేమకి పెద్దల ఆశీస్సులు కూడా ఉండేలా చూసుకున్న దంపతులుగా శ్రీకాంత్ – ఊహ కనిపిస్తారు.
శ్రీకాంత్ – ఊహ అందాల జంట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇద్దరూ కూడా అందానికి .. అణకువకి ప్రతీకగా కనిపిస్తారు. సినిమావాళ్ల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలబడవు అనే విమర్శ ఇండస్ట్రీ బయట వినిపిస్తూ ఉంటుంది. అదంతా కేవలం అపోహ మాత్రమే అని నిరూపించిన కొన్ని జంటల్లో శ్రీకాంత్ – ఊహ నిలుస్తారు. అలా ఏడడుగులతో తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ జంట, ఈ నెల 20వ తేదీతో 24 వసంతాలు పూర్తి చేసుకుంది.వాళ్ల అనురాగానికి గుర్తుగా .. నటవారసుడిగా ఇండస్ట్రీకి ‘రోషన్’ అనే కుర్ర హీరోను అందించారు.
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ, తమ ప్రేమ – పెళ్లి గురించి ప్రస్తావించాడు. ‘ఆమె’ సినిమా షూటింగు సమయంలో నేను మొదటిసారిగా ‘ఊహ’ను చూశాను. అది నాయిక ప్రాధాన్యత కలిగిన కథ కావడం వలన బాగా క్రేజ్ ఉన్న ఆర్టిస్టును తీసుకుంటారని అనుకున్నాను. కానీ సెట్లో ఊహ అడుగుపెట్టింది .. ఇంతలావుగా ఉన్న అమ్మాయి హీరోయినా? అనుకున్నాను. ఆ తరువాత మా మధ్య పరిచయం ఏర్పడింది. మనిషిలాగే మనసు ఎంత మంచిదో అర్థమైంది. దాంతో మా పరిచయం స్నేహంగా మారడం .. అది కాస్తా ప్రేమగా మారిపోవడం చకచకా జరిగిపోయాయి. మా ఇంట్లో ఫంక్షన్స్ కి ఊహను పిలిచేవాడిని .. ఆ సమయంలోనే ఆమెను మా వాళ్లకు పరిచయం చేశాను. వాళ్లు కూడా ఆమెకి ఫుల్ మార్క్స్ ఇచ్చేశారు. అలా మా ప్రేమకి మూడుముళ్ల బంధం పడింది” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- రోజా విసిగించేసేదన్న శ్రీకాంత్!











