రియా చక్రవర్తి బాటలో మరో కథానాయిక ఇప్పుడు హైకోర్టు ను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. కన్నడ , తెలుగు భాషల్లో నటించిన గ్లామరస్ బ్యూటీ సంజనా గిల్రానీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్.డీ.పీ.ఎస్ ప్రత్యేక కోర్ట్ సంజన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను పలుమార్లు తిరస్కరించింది. తాజాగా సంజనా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. తనపై నార్కోటిక్ విభాగం అధికారులు, సిసిబి అధికారులు చేస్తున్న ఆరోపణల్లో ఒక్క ఆధారం కూడా లేదని, తన పేరు ఇప్పటికీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు అని సంజనా కోర్టుకు తెలిపింది.
సంజనా కోర్టులో వేసిన పిటిషన్ లో సీసీబీ అధికారులను, కాటన్ పేట పోలీస్ స్టేషన్ పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. సంజనాని ఈ నెల 23 వరకు విచారణ నిమిత్తం రిమాండ్‌కి తరలించిన విషయం తెలిసిందే. సంజనా సిసిబి అధికారులకు కీలక విషయాలను తెలిపిందని, అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇదే కేసులో కన్నడ స్టార్ జంట దింగత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇదిలావుండగా ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు తగిన శిక్ష విధించాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కర్ణాటకలో డ్రగ్స్ సంస్కృతి రోజురోజుకు ఎక్కువ అవుతుందని, ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారు వాపోతున్నారు.











