ప్రస్తుతం ఏపీలో రాజకీయవర్గాల్లో తెరపైకి వచ్చిన పేరు ఆకుల వెంకటేష్ అలియాస్ ఆకుల వెంకటేశ్వర్లు అలియాస్ ఆకుల వెంకట్. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా రాళ్లదాడి ఘటన విషయంలో ఈ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పార్టీపై చర్చించిన అంశమని చెబుతూ ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియోలోనూ ఆయన లోకేష్‌ని తిడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక రాళ్లదాడి వ్యవహారానికి సంబంధించి ఆయన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డానని, టీడీపీ హ్యాండించ్చిందని, అందుకే కోపంతో చొక్కా చింపి విసిరేశానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఓ వ్యక్తితో తనకు స్థల వివాదం ఉందని, ఆ వ్యక్తికి చంద్రబాబు ఓ మాట చెబితే తన వివాదం పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించాడు. పనిలో పనిగా తన వెనుక వైసీపీ దని చెబుతున్నాడు. ఈ కోణంలో అనేక ప్రశ్నలూ వస్తున్నాయి. అసలు చంద్రబాబు సభలో రాళ్ల దాడి జరగకపోతే..రాయి ఎలా వచ్చిందనే ప్రశ్నతోపాటు ఆకుల వెంకట్ అంతమంది జనాల్లో ఉండి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించడం ఏంటనే ప్రశ్నకూడా తలెత్తుతోంది.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనూ పలు మార్లు..
ఇక ఆకుల వెంకట్ టీడీపీలో పనిచేశారు. గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనూ పలు మార్లు మాట్లాడారు. 2016 జనవరి 16న జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టిక్కెట్ విషయంలో పార్టీకే వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో పార్టీ బతకాలంటే..తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని కార్యాలయంలోనే హడావుడి చేశారు. అప్పట్లో బీజేపీతో పొత్తులో భాగంగా.. జూబ్లీహిల్స్ డివిజన్‌ను బీజేపీకి కేటాయించారు. ఆ డివిజన్ నుంచి అప్పట్లో కాజా సూర్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆకుల వెంకటేష్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అప్పుడు టీడీపీలో ఉండి..తరువాత టీఆర్ఎస్‌కి వెళ్లిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తప్ప.. నియోజకవర్గం టీడీపీలో మంచి నాయకుడే లేరని అప్పట్లోనే వ్యాఖ్యానించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రచారంలోనూ ఎక్కడా కనిపించలేదు.
చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి..
మళ్లీ 2020 జులైలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది ఆపివేయడంతో మళ్లీ బూతు పురాణం అందకున్నారు. పోలీసులతో మాట్లాడుతూనే..తాను పార్టీకి ఎంతో చేశానని, ఇప్పుడు గేటు బయటే ఉంచుతున్నారన్నారు. తాజాగా తిరుపతి సభలో చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపిస్తూ చొక్కా విసిరేసిట్లు చెప్పారు. అచ్చెన్నాయుడితో మాట్లాడినట్టు వీడియో కూడా విడుదలైంది. ఆ వీడియో ట్యాపంరింగ్ చేసి అబద్దపు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
ఆ స్థలం విషయానికి వస్తే..
ఇక తాజాగా ఆకుల వెంకటేష్ చెబుతున్న ప్రకారం..ఆ స్థలం విషయానికి వస్తే.. ఆ స్థలం దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణది. ఆయనతో చంద్రబాబు ఓ మాట చెబితే అయిపోతుందని ఆకుల వెంకటేశ్ వాదన. అంటే ఇన్‌డైరెక్ట్‌గా సెటిల్మెంట్ చేయమన్నారని చెప్పాలి. ఇలాంటివి చంద్రబాబు వైఖరికి బహుదూరమైన కార్యక్రమాలుగా ఆయన గురించి తెలిసినవారు చెబుతారు. చంద్రబాబుపై వైఎస్, నేటి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నా.. ఇప్పటివరకు రుజువు చేయలేకపోయాయంటే.. ఆ వైఖరే కారణమని కూడా చెబుతారు. అలాంటిది రూ.కోట్ల విలువైన స్థలం విషయంలో చంద్రాబాబు లేదా బాలయ్య ఎందుకు జోక్యం చేసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. సివిల్ మేటర్ కాబట్టి..న్యాయ సహాయం అవసరమైతే చేసే ఆలోచన ఉండేదేమో..కాని డైరెక్ట్‌గా జోక్యం చేసుకోమంటే చంద్రబాబే కాదు.. ఏ పార్టీలో ఉన్నాఏ సీనియర్ నేత కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఇక టీడీపీ కోసం అన్నీ త్యాగం చేశానని చెబుతున్నారు ఆకుల వెంకట్ . కాని 2016లో చేసిన వ్యాఖ్యలను చూస్తే.. నియోజకవర్గంలో మాగంటి గోపి తప్ప నాయకుల్లేరని చెప్పారు. అప్పటి నుంచి పార్టీ నేతలు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదనే చర్చ నడుస్తోంది.
కొన్నాళ్లుగా అసహనంగా..
2016 తరువాత చాలామంది ఇతర పార్టీల్లో చేరినా ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో కొంతమంది ఇప్పటికీ పార్టీతోనే ఉన్నారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు.అలా చేరకపోవడానికి వారికి పార్టీ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం లేదా నమ్మకం ఒక కారణం కాగా మరికొందరికి వేరే అవకాశాల్లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు.ఆకుల వెంకటేష్ విషయంలో ఈ రెండు అంశాలపైనా చర్చ నడుస్తోంది. గతంలో ఓసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొన్నాళ్లుగా అసహనంతో ఉన్న ఆకుల వెంకటేష్‌ను ఎవరైనా రెచ్చగొట్టారా.. లేక ఆ స్థలం విషయంలో ఏదైనా హామీ లభించిన మేరకు టీడీపీలోనే ఉండి ఆ పార్టీనే టార్గెట్ చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే.. స్పైగా వాడుకున్నారన్న చర్చ కూడా టీడీపీలో నడుస్తోంది.
Must Read ;- చంద్రబాబుపై రాళ్ల దాడి.. తేల్చుతారా.. తేల్చేశారా?











