తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగిన అంశం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. రాళ్ల దాడి జరగలేదని అధికార పక్షంతో పాటు పోలీసులు కూడా చెప్పడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా అధికార పక్ష కుట్రగా అభివర్ణిస్తున్నాయి.
టీడీపీ శ్రేణుల ఆందోళన
చంద్రబాబు సభలో రాళ్లదాడి ఘటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. చంద్రబాబు పర్యటనను, టీడీపీ సభలకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించాయి. అయితే వైసీపీ కూడా ప్రత్యారోపణలకు దిగింది. చంద్రబాబుపై దాడి చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర హోం మంత్రి సుచరిత, మరో మంత్రి పెద్దిరెడ్డి కూడా చంద్రబాబుపైనే ప్రత్యారోపణలు చేశారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చంద్రబాబు సభపై రాళ్ల దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా తెలిపారు. ఈ ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశామని, సీసీ కెమెరా ఫుటేజీతో పాటు ప్రత్యక్ష సాక్షులను, భద్రతా సిబ్బందిని కూడా విచారించామన్నారు. ఆధారాలు ఉంటే వెంటనే ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని, చంద్రబాబు పర్యటనకు గట్టి భద్రత కల్పించామని డీఐజీ పేర్కొన్నారు.
నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన
కాగా ఈ అంశంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసనలకు దిగారు. దీంతోపాటు ఏపీ గవర్నర్‌కు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారు. సభలో రాళ్ల దాడి జరిగితే.. జరగలేదని పోలీసులు కూడా చెప్పడం ఏంటని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే నకిలీ ఓటర్ల నమోదు విషయంపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ తాజాగా జరిగిన దాడి అంశంపైనా సీఈసీకి ఫిర్యాదు చేసింది. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు , కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను కలిసి తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో రెండు లక్షల నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పడంతో పాటు ఏదేని రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరోవైపు టీడీపీ నేతలు కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను కలిసిన టీడీపీ నేతలు..ఈ దాడి వ్యవహారం, ఏపీ ప్రభుత్వం చెబుతున్న వాదనను కూడా వివరించారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఫిర్యాదు చేశారు.
చొక్కా విప్పి నిరసన తెలిపానంటూ..
కాగా చంద్రబాబు సభలో రాళ్ల దాడి వ్యవహారంలో ఓ వ్యక్తి తానే చొక్కా విప్పి నిరసన తెలిపానని వీడియో పోస్టు చేసినట్టు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయానని, ఎలాంటి సాయం కూడా అందలేదని, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వ్యక్తి 400 గజాల భూమిని కబ్జా చేసినట్లు చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై మరోసారి చంద్రబాబుకు చెప్పేందుకు తిరుపతి వచ్చానని, అయితే ఆయన చూసీ చూడనట్టు ఉన్నారని, అందుకే కోపం వచ్చి చొక్కాను విప్పేసి చంద్రబాబు నాయుడుపై విసిరినట్లు చెప్పారు. ఈ వీడియోలో ఆయన తిరుపతిలోని పోలీస్ స్టేషన్‌లో చెబుతున్నట్లు ఉండడం గమనార్హం.
Must Read ;- అలిపిరి ఘటనకే భయపడలేదు, రాళ్ల దాడికి భయపడతానా? : చంద్రబాబు నాయుడు











