మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి వారం రోజులుగా అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో విధించడంపై మాజీ ఐఏఎస్ లు, ఇతర ఉన్నతాధికారులు, మేధావుల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి..
‘‘సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ’’ పేరుతో ప్రజాస్వమ్య పరిరక్షణకు మేధావులంతా ముందడుగేశారు .. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడంపై సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. జస్టిస్ భవానీ ప్రసాద్, వి లక్ష్మణ్ రెడ్డి, టి గోపాలరావు, నిమ్మగడ్డ రమేశ్ తదితరులతో కూడిన ప్రజాస్వామ్య పరిరక్షణా వేదిక తీవ్ర వ్యతిరేకతను, నిరసనను తెలియజేయడం గమనార్హం..
ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవి రమేష్ అయితే, ‘‘ మాజీ సీఎం చంద్రబాబును బాధ్యుణ్ని చేయడం భయానకం. అధికారుల తప్పులను నాయకులకు ఆపాదిస్తే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అప్రూవర్ గా మారడానికి నేనేమీ క్రిమినల్ ను కాదు..నా స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబు అరెస్టును అంగీకరించను. ఒరిజినల్ ఫైల్స్ లేకుండా ఆయనపై పెట్టిన కేసు నిలబడదు. చంద్రబాబును బాధ్యుణ్ని చేసి కేసుపెట్టడం హాస్యాస్పదం…స్కిల్ స్కామ్ అయితే దానికి అధికారులను ఎందుకు బాధ్యులను చేయలేదు..? ఒరిజినల్ ఫైల్ లేకుండా కేసేంటి, షాడో ఫైల్ ఆధారంగా కేసా..? అందుకు అప్పటి సీఎంను బాధ్యుణ్ని చేస్తే వ్యవస్థ కూలుతుందని’’ అన్నారు..
అంతేకాకుండా, ఉద్యోగ విరమణనాంతరం ప్రస్తుతం తాను సేవలందిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకూ పీవీ రమేష్ రాజీనామా చేయడం గమనార్హం.. తన పదవీకాలంలో నిరంతరం ప్రజాప్రయోజనాల కోసమే పనిచేశానంటూ ట్వీట్ కూడా చేశారు..
ఇక మరో ఉన్నతాధికారి సిఎం జగన్ ప్రభుత్వంలో తొలి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అయితే, ‘‘సిఐడి దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధం..కేబినెట్ నే తప్పుబట్టే దర్యాప్తు సంస్థను బహుశా రాజ్యాంగంలో ఎక్కడా తయారు చేయలేదు. అమల్లో తప్పుచేస్తే అధికారిదే ఆ తప్పు… రంధ్రాన్వేషణ చేస్తూ మంత్రి, ముఖ్యమంత్రి వరకు వెళ్లిపోతామంటే ఎలా..? దర్యాప్తు సంస్థకు ఈ విషయాలు తెలియకపోతే వారిని కూర్చోపెట్టి శిక్షణ ఇవ్వడం మంచిది..తన ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో ఏనాడూ ఆయాచిత లబ్ది చేయాలని సీఎంలుగా చంద్రబాబు, రాజశేఖర రెడ్డి తనను కోరలేదు. ఉమ్మడి ఏపిలో నేను జాతీయ క్రీడలు నిర్వహించాను, గచ్చిబౌలి క్రీడా ప్రాంగణాలు నిర్మించాను, ఎవరికైనా సాయం చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు తనను ఏనాడూ అడగలేదు..ప్రభుత్వమనేది ప్రైవేటు బిజినెస్ కాదు, ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుంది. ఏ ముఖ్యమంత్రీ ఒక అధికారిని పిలిచి సాయంత్రానికల్లా డబ్బులు తీసుకొచ్చి తనకివ్వమని చెప్పరు.. ఈ కేసులో సిఐడి దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధం.. కానిస్టిట్యూషనల్ రెమిడీస్ కు న్యాయస్థానాలు ఉన్నాయి.. చంద్రబాబు అరెస్టు చాలా తప్పు..అధికారం ఉందని అడ్డదారులు తొక్కితే ప్రజలు బుద్ధి చెబుతారని’’ వ్యాఖ్యానించారు.
ఇక సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నె నాగేశ్వర రావు అయితే, ‘‘గవర్నర్ అనుమతిలేకుండా చంద్రబాబుపై దర్యాప్తు అక్రమం అన్నారు. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ లో తప్పులను బహిర్గతం చేశారు. సెక్షన్ 17ఏ కింద ముందస్తు అనుమతులు అవసరంలేదని చెప్పడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం..సిఐడి రిమాండ్ రిపోర్టు కాకమ్మ కబుర్లలా ఉందని’’ పేర్కొన్నారు.
సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అయితే, ‘‘నేరం మోపడం కాదు, దానికి తగ్గ సాక్ష్యాధారాలు చూపాలని’’ అన్నారు..
మాజీ అటార్నీ జనరల్ కె రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘నిధుల వినియోగంలో ముఖ్యమంత్రి పాత్ర ఉండదు..ఖర్చుపెట్టేది అధికారులే..ఈ కేసులో ఏ ఒక్క అధికారీ వ్యతిరేక సాక్ష్యం ఇవ్వలేదు .. సొమ్మును విత్ డ్రా చేసి చంద్రబాబుకు ఇచ్చినట్లు ఆధారాల్లేవు. ఆధారాల్లేకుండా రెండేళ్ల తర్వాత కేసు చట్ట విరుద్ధమని’’ అన్నారు..
మణిపూర్ ఉక్కుమహిళ, పౌరహక్కుల నేత ఇరోమ్ చానుషర్మిల కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు..ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులూ ఈ దురాగతంపై తీవ్రంగా స్పందించారు. కొందరైతే తమ శిక్షణకు ఎంతైందో చెబితే ఆ మొత్తం తామే చెల్లిస్తామని, తమ భవిష్యత్తు కోసం ఆరాటపడే మాజీ ముఖ్యమంత్రిని జైలు పాల్జేయడాన్ని గర్హించారు.
‘‘నాటి శిక్షణతోనే మా బిడ్డలకు ఉద్యోగాలు..అందుకు అయిన ఖర్చెంతో చెబితే మేం కడతాం. చంద్రబాబుపై మచ్చరావడం బాధగా ఉంది. ఆ డబ్బు దోచేస్తే పిల్లలకు శిక్షణ ఎలా ఇచ్చారు..?’’ అంటూ విద్యార్ధినుల తల్లిదండ్రుల భావోద్వేగం చూశాం..
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నెలకొల్పిన వందలాది ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుని, వివిధ నగరాల్లో, విదేశాల్లో ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న యువతరమంతా రోడ్డెక్కింది.. నిరుద్యోగులు, ఉద్యోగులు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ నిపుణుల్లో తీవ్ర నిరసనలు. తొలుత హైదరాబాద్ లో ఐటి నిపుణులు భగ్గుమన్నారు. గచ్చిబౌలి, నానక్ రాం గూడ విప్రో సర్కిల్, కుకట్ పల్లి, చందానగర్, సైబర్ టవర్స్, మాదాపూర్ హైటెక్ సిటీల వద్ద ధర్నాలకు దిగారు..ఆ స్ఫూర్తితో విజయవాడ, బెంగళూరులోనూ యువత, మహిళలు పెద్దఎత్తున ప్రదర్శనలు..‘‘ఐయామ్ విత్ సిబిఎన్’’, ‘‘సైకోపోవాలి-సైకిల్ రావాలి’’ నినాదాలతో మార్మోగించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, కాలనీల్లోనే కాదు, దేశవిదేశాల్లోనూ సంఘీభావ ప్రదర్శనలు, భేటీలే..
మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ లోనేకాదు, పొరుగురాష్ట్రాల్లో, దేశవిదేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది..మొదట్లో స్వీట్లు పంచుకుని, క్రాకర్లు కాల్చి సంబరాలు చేసుకున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మింగలేక, కక్కలేని స్థితి, అంతర్గతంగా మల్లగుల్లాలు.. కోరి కొరివితో తలగోక్కున్నాం, మన గొయ్యి మనమే తవ్వుకున్నామనే మధనమే..చంద్రబాబును జైలుకు పంపడం, జైలువద్దే పవన్ కల్యాణ్ తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు గోరుచుట్టుమీద రోకటిపోటే..వైనాట్ 175 అనుకున్నది కాస్తా, అసలు డబుల్ డిజిట్ వస్తుందా అనే డౌటే అందరిలోనూ..రేపటి ఎన్నికల్లో టిడిపి-జనసేన అలయెన్స్ క్లీన్ స్వీప్ తథ్యమనే భావన ఎన్నికలకు 6నెలల ముందే అన్నివర్గాల ప్రజల్లో బలంగా వెళ్లడం జగన్మోహన రెడ్డికి, వైసిపికి ఆశనిపాతమే..
—