‘అల్లరి’ నరేశ్ .. విరుగుడు లేని వినోదానికి కేరాఫ్ అడ్రెస్. తెలుగు తెరపై సరికొత్త కామెడీని పరిగెత్తించిన కథానాయకుడు.సీనియర్ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత, హాస్య కథానాయకుల లోటు తెలియకుండా ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. చాలా ఈజ్ తో హాస్యాన్ని పండించడం ఆయన ప్రత్యేకత. హాస్యంతో ముడిపడిన అనేక కథల్లో ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల్లో ఆయన మెప్పించాడు. ‘అల్లరి’ నరేశ్ సినిమా అంటే, హండ్రెడ్ పర్సెంట్ కామెడీ వర్కౌట్ అవుతుందని అభిమానులు భావిస్తారు .. కంటెంట్ ఉంటే చాలు, భారీ విజయాన్నే ముట్టజెబుతారు.
అలాంటి ‘అల్లరి’ నరేశ్ తాను కేవలం కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్ తో కూడిన పాత్రల్లోనూ ఒదిగిపోగలనని నిరూపించాడు. ‘నేను’ .. ‘ప్రాణం’ .. ‘గమ్యం’ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. నరేశ్ లో అల్లరివాడేకాదు .. మంచి నటుడు కూడా ఉన్నాడనే ప్రశంసలు అందుకున్నాడు. వరుసగా హాస్యభరిత సినిమాలను చేస్తూ వస్తున్న ఆయన, మళ్లీ ఎమోషన్ ప్రధానమైన కథను ఎంచుకుని రంగంలోకి దిగాడు .. ఆ సినిమానే ‘నాంది‘. సతీశ్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాకి, విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు.
‘అల్లరి’ నరేశ్ ఇంతవరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది .. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. ఆవేదనతో కూడిన ఆలోచనతో ఈ పోస్టర్లో ‘అల్లరి’ నరేశ్ కనిపిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ‘బంగారు బుల్లోడు’తో నిరుత్సాహ పరిచిన ‘అల్లరి’ నరేశ్, ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Must Read ;- బంగారు బుల్లోడు (రివ్యూ)











