ఈ సంక్రాంతి అంతా యాక్షన్ చిత్రాలతో హోరెత్తిపోయింది. ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ కావాలంటే కామెడీ సినిమా కావాలి. ప్రస్తుతం మనకున్న కామెడీ హీరోల్లో అల్లరి నరేష్ నే ప్రముఖంగా చెప్పుకోవాలి. నరేష్ మరోసారి చేసిన కామెడీ ప్రయత్నం ‘బంగారు బుల్లోడు’. గిరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఇందులో నరేష్ కామెడీ పండిందా? మళ్లీ విజయం వైపు నరేష్ పయనిస్తున్నాడా అనే విషయాలను ఓసారి చూద్దాం.
కథలోకి వెళితే..
బంగారు బుల్లోడు అనే పేరు వినగానే ఇదో సంపన్న కుటుంబంలోని వ్యక్తి కథ అని అందరూ అనుకుంటారు. నిజానికి ఈ కథ అది కాదు. అమ్మవారి నగలతో ముడిపడిన డ్రామా. భవానీ ప్రసాద్ (అల్లరి నరేష్) ఓ బ్యాంకు ఉద్యోగి జీవితంలో జరిగిన కథ. అతను ఉద్యోగంతో పాటు వంశపారం పర్యంగా వచ్చిన నగల తయారీ వృత్తి కూడా చేస్తుంటాడు. ఆ వృత్తిలో ఉండే తాతకు సాయపడుతుంటాడు.
తాత అతనికి తను గతంలో చేసిన ఓ మోసం గురించి చెబుతాడు. అదేంటంటే దేవుడి గుళ్లో నగల స్థానంలో అమ్మవారికి అలాంటివే గిల్టు నగలను చేయించాలనని, ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యతను మనవడికి అప్పగిస్తాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలను వాడుకోవడం, అలాంటి ఆలోచనతోనే తాత కోరికను తీర్చాలనుకోవడం లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. లక్ష సాధనలో ప్రసాద్ కు ఎదురైన ఆటంకాలు ఏమిటి? చివరికి ఏమైంది? అనేదే అసలైన కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
హాస్యానికీ అపహాస్యానికీ తేడా ఉంటుంది. కామెడీ పండకపోతే అది అపహాస్యానికి దారితీస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కథలేక పోయినా కామెడీని పండించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉన్న కామెడీని పండించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అసలు నగల స్థానంలో గిల్టు నగలు అనే కాన్సెప్ట్ పాతదే అయినా కొత్త గా చెప్పడానికి ప్రయత్నించడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది. కామెడీ లేకపోయినా ఉత్కంఠ కలిగించే కథనం ఉందా అంటే అదీ లేదనే చెప్పాలి.
కథనం ఆసక్తిదాయకంగా సాగితే ఎవరూ లాజిక్కుల గురించి పట్టించుకోరు. రెండూ లేకపోవడం వల్ల బంగారు బుల్లోడు ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. భవానీ ప్రసాద్ గా నరేష్ పాత్ర వరకూ ఓకే. కామెడీనే నమ్ముకుని హీరోగా ప్రయాణం సాగిస్తున్నప్పుడు తనను తాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవలసిన అవసరం కూడా ఉంటుంది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ని రీప్లేస్ చేస్తూ సినిమా పరిశ్రమ నరేష్ కు కూడా ఓ స్థానాన్ని కల్పించింది.
ఈ సినిమా ఫలితం తోనైనా నరేష్ మూస పాత్రల జోలికి వెళ్లకుండా మరో మార్గం ఎంచుకుంటే మంచిది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాలోనూ వెన్నెల కిషోర్ తనదైన టైమింగ్ తో అలరించాడు. ఇందులో కూడా ఆ టైమింగ్ కనిపిస్తుంది. అందుకే అతను కనిపిస్తే ఉల్లాసంగా ప్రేక్షకులకు అనిపిస్తుంది. వడ్డీ వ్యాపారి పాత్రలో పోసాని నవ్విస్తాడనుకుంటే అదీ జరగలేదు. వడ్డీ వ్యాపారం ఇలా కూడా చేయవచ్చా అనిపిస్తుంది అంతే.
హైలైట్స్: కథలో తనికెళ్ల భరణి పాత్ర మెప్పిస్తుంది. సాయి కార్తీక్ నేపథ్య సంగీతం ఫరావాలేదనిపిస్తుంది. ఎక్కువ మైనస్ లే ఈ సినిమాలో హైలైట్స్ అనుకోవాలి.
నటీనటులు: అల్లరి నరేష్, పూజ జవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, రాజేష్, పృధ్వీ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
రచన, దర్శకత్వం: గిరి పలిక
విడుదల తేదీ: జనవరి 23, 2021
ఒక్క మాటలో: బంగారం లేని బుల్లోడు
రేటింగ్: 2/5
– హేమసుందర్ పామర్తి











