పవన్ కల్యాణ్ .. ఈ పేరు వింటేనే యూత్ ఉత్సాహంతో ఊగిపోతుంది. ఆయన తెరపై కనిపిస్తే చాలు వాళ్లలో చురుకుదనం చెలరేగిపోతుంది. పవన్ కి మొదటి నుంచి కూడా గుర్రాలు .. తుపాకులతో కూడిన కథలంటే చాలా ఇష్టం. తెరపై ఆయన చాలాసార్లు ఆ ముచ్చట తీర్చుకున్నాడు కూడా. అయితే ఎప్పుడూ కూడా ఆయన ఇష్టానికి చారిత్రక నేపథ్యం తోడుకాలేదు. పవన్ హుషారుకి చారిత్రక నేపథ్యాన్ని జోడించే బాధ్యతను దర్శకుడు క్రిష్ తీసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక భారీ చిత్రం రూపొందుతోంది.
మొఘల్ పాలనా కాలంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. రాజుల అధీనంలో ఉన్న ‘కోహినూర్’ వజ్రాన్ని అపహరించే బందిపోటు దొంగగా ఈ సినిమాలో పవన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాకి ముందుగా ‘కోహినూర్’ అనే టైటిల్ ను పరిశీలించారు. ఆ తరువాత ‘విరూపాక్ష‘ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఇక ప్రస్తుతం ‘హరహర మహాదేవ’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ టైటిల్ నే రిజిస్టర్ చేయించారని అంటున్నారు. పవన్ ఓ బందిపోటుగా గుర్రాన్ని అధిరోహించి దానిని ముందుకు దూకించే క్రమంలో ‘హరహర మహాదేవ’ అంటాడట. అందుకే ఈ టైటిల్ ను సెట్ చేశారని చెప్పుకుంటున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక జాక్వలిన్ ఓ ముఖ్యమైన పాత్రలో మెరవనుందని అంటున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కీరవాణి అందించే మెలోడీ సాంగ్స్ మంత్రముగ్ధులను చేస్తాయని చెబుతున్నారు. తొలిసారిగా పవన్ చేస్తున్న ఈ చారిత్రక చిత్రం, ఆయన పవర్ చూపించడం ఖాయమనేది అభిమానుల మాట.
Must Read ;- పవన్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్న సురేందర్ రెడ్డి