జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై వి.బి. రాజేంద్ర ప్రసాద్ అనేక చిత్రాలను నిర్మించారు. మంచి కథాబలం కలిగిన సినిమాలను ఆయన తెరకెక్కించారు. ఆ సినిమాలన్నీ కూడా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలబడినవే. ఒక నిర్మాతగా ఆయన కథ విషయంలో .. పాత్రలకి తగిన నటీనటుల ఎంపిక విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ఆయన, ‘దసరా బుల్లోడు’ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలను నిర్మించిన ఆయన గురించి, తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.
‘దసరాబుల్లోడు‘ సినిమా ఇటీవల 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ సినిమాకి దర్శక నిర్మాత అయిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడాలనిపించింది. ఆయన నిర్మించిన సినిమాలకి అకారంతో టైటిల్స్ మొదలయ్యేవి. ‘అన్నపూర్ణ’ .. ‘అక్కాచెల్లెళ్లు’ .. ‘అదృష్టవంతులు’ .. ‘ఆస్తిపరులు’ .. ‘ఆత్మబలం’ .. ‘ఆరాధన’ సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. ఆయనకి అకారం సెంటిమెంట్ అనుకునేవాళ్లం. రచయితలుగా మేము ఒకస్థాయికి వచ్చిన తరువాత ఆయనతో మాకు పరిచయం ఏర్పడింది. ఆయనకి కథ – స్క్రీన్ ప్లే పై మంచి అనుభవం ఉందనే సంగతి అప్పటికే మాకు తెలుసు.
రాజేంద్రప్రసాద్ గారితో కలిసి సినిమాలు చేయాలనుకున్నాము .. కథా చర్చలు జరిగినప్పటికీ వర్కౌట్ కాలేదు. కానీ ఆయనతో మాకు గల అనుబంధం పెరిగిపోయింది. ఆయన తన హోదాను కాపాడుకుంటూ వచ్చేవారు. జీవితాన్ని అనుభవించాలి అనే ఒక బలమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా కనిపించేవారు. ఆయన గొప్ప భక్తుడు కూడా .. ప్రతి ఏడాది అయ్యప్పమాల వేసుకుని ‘శబరిమలై’ వెళ్లి వచ్చేవారు. ఒకసారి ఆయన ‘కృష్ణ – శోభన్ బాబు‘ కాంబినేషన్లో ఒక కథను రాయమన్నారు. మేము ఆ కథను సిద్ధం చేశాముగానీ అది కూడా పట్టాలెక్కలేదు. రామానాయుడిగారి బ్యానర్లో ఎన్నో సినిమాలకి పనిచేసిన మేము, రాజేంద్రప్రసాద్ గారితో ఒక్క సినిమా కూడా చేయలేకపోవడం బాధకలిగిస్తూ ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- పరుచూరికి కోపం తెప్పించిన దర్శకుడు











