రాజధాని మార్పు అసాధ్యం!
ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మార్చుకుంటూ పోతే .. ప్రపంచంలో ఏ దేశానికి రాజధాని ఉండదు. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం అంటూ ఉండదు. అలానే రాజధానికి వ్యతిరేకంగా కూడా ఏ ప్రభుత్వాలు నడుచుకోవు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన చట్టంలో 5, 6 సెక్షన్లలో ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉంది కాబట్టే ప్రజాభిప్రాయం మేరకు గుంటూరు – విజయవాడ మధ్య రాజధానిని నిర్మించ సంకల్పిచారు. అదే విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం కొత్తగా ఏర్పడే రాజదానిలో రాజ్ భవన్, సచివాలయం, శాసన సభ, శాసన మండలి, హైకోర్టు తదితర కట్టడాలను కేంద్రం నిధుల ద్వారా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేసింది అదే. ఒకటే రాజధాని అమరావతి అని చారిత్రాత్మక నామకరణంతో కట్టడాలను నిర్మించారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రాల పేర్లు, రాజధాని ప్రాంతం మార్పు అంటూ ఏమీ ఉండవు. ఈ అంశాలనే హైకోర్టు ధర్మాసనం ముందు రైతుల తరుఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్.
ఏపీ ప్రజలకు అమరావతే రాజధాని!
30 వేల మంది రైతులు తమ జీవనోపాధికి ఆధారమైన 33 వేల 771 ఎకరాల భూములను అమరావతి రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా అందించారు. ప్రభుత్వం భూసమీకరణ చట్టం ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీంలో భూములను సేకరించి నిర్మాణాలు చేపట్టింది. అలానే తెలుగుదేశం ప్రభుత్వం రూ.5,000 కోట్లుతో పనుల కూడా ప్రారంభించి పూర్తి చేసింది. వాటిని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది. అంతేకాక రాజధాని అమరావతి లో అప్పట్లో రన్నింగ్ లో ఉన్న సుమారు రూ.41 వేల కోట్ల ప్రాజెక్ట్ పనులను నిలిచిపోయాయి. వికేంద్రీకరణతో రాజధానిని మూడు ముక్కలుగా ప్రకటించి అభివృద్ధికి తీవ్ర విఘాతం కల్పించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఈ కుట్రను ఎదుర్కొవడానికే రాజధానికి భూములిచ్చిన రైతులు హైకోర్టు మెట్లెక్కారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో 57 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇవి ఇప్పుడు విచారణ దిశగా హైకోర్టులో ముందుకు సాగుతున్నాయి. సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణ తో కూడిన ధర్మాసనం సోమవారం నుంచి ఇరు పక్షాల వాదనలు వింటుంది.
Must Read ;- రాజధాని రైతులకు వెల్లువలా మద్దతు











