ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ సంస్థ ఆస్తులన్నీ అమూల్ డెయిరీకి అతి తక్కువ ధరకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామరాజు హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ హైకోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూ ద్వారా ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. దీనిపై గుజరాత్‌లోని అమూల్‌కు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
ఏపీలో అమూల్ డెయిరీ ద్వారా పాలు సేకరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయడంతోపాటు, ఏపీ డెయిరీ ఆస్తులు తక్కువ ధరకు లీజుకు ఇవ్వడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని ఎంపీ రఘురామరాజు హైకోర్టులో వేసిన పిటీషన్‌తో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే అమూల్ డెయిరీ ఏపీలో పాలు సేకరించవద్దని తాము చెప్పడం లేదని ధర్మాసనం పేర్కొంది. గుజరాత్‌లోని అమూల్ డెయిరీకి ఏపీ డెయిరీ ఆస్తులు ఎలా కట్టబెడతారని, ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చు చేస్తారని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. అమూల్ డెయిరీ కోసం ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
Must Read ;- ఏఏజీపై బార్ కౌన్సిల్‌కు రఘురామరాజు ఫిర్యాదు.. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంపై ఎంపీలకు లేఖలు











