నెత్తురోడిన రహదారి..
అనంపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. ఇన్నోవా కారును వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా బళ్లారిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రఖ్యాత సూర్యనారాయణ ఆలయం కొలువైన బూదగవిలో బందువుల రోదనలు మిన్నంటాయి. మృతులంతా ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.
ప్రముఖుల సంతాపం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని!
ఉరవకొండ రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలానే గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ సూచించారు. ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రాబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. మృతులు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.










