వికటకవి తెనాలి రామకృష్ణ గురించి తెలియని వారు ఉండరు. విజయ నగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలైన కవుల్లో తెనాలి రామకృష్ణకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఆయన కథను యానిమేషన్ ప్రక్రియలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడదే జరుగుతోంది. ఇంతకుముందు ఆయన జీవితం ఆధారంగా తెనాలి రామకృష్ణ సినిమా తెరకెక్కింది.
అందులో ఎన్టీఆర్, ఏయన్నార్ నటించారు. టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి. తాజాగా ‘ధీర’ పేరుతో ఓ యానిమేషన్ సినిమా రూపొందుతోంది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా అనేక భాషల్లో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం,మలయాళం, కన్నడంతో పాటు మొత్తం 12 భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి రాపోలు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి వాయిస్ ఎవరు అందిస్తారనేదే కీలకం.
అన్నీ యానిమేటెడ్ పాత్రలే కాబట్టి తెనాలి రామలింగడుకు ఎవరు డబ్బింగ్ చెప్పారన్నది కూడా ఆసక్తిదాయకంగానే ఉంది. తెలుగులో రామలింగడు పాత్రకు బెల్లంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో వివేక్ ఒబెరాయ్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడంలో ధ్రువ సర్జా తమ గళాలను ఇస్తున్నారు. మోషన్ క్యాప్చర్ సినిమాగా ఇది రూపొందుతోంది. దీని డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ భారీ ఆఫర్ తో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీని టీజర్ ను కూడా విడుదల చేశారు. మంచి స్పందన లభిస్తోంది.











