అర్నాబ్ గోస్వామి.. టీఆర్‌పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జైలుకి వెళ్లి వచ్చిన జర్నలిస్టు. తాను ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్‌గా ఉన్న రిపబ్లిక్ ఛానెల్‌ను అందరి కంటే ముందుంచాలనేదే లక్ష్యంగా చేసిన పనులు.. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు చాలామంది మెడకు చుట్టుకుంటున్నాయి. ఏకంగా సైనిక రహస్యాలను కూడా సంపాదించి..బహిర్గతం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొవాల్సి వస్తోంది.
పోలీసులకు చిక్కిన చాట్ వివరాలు?
ఇక టీఆర్‌పీ రేటింగ్ కుంభకోణం విషయంలో.. 2013 నుంచి 2019 వరకు బ్రాడ్‌కాస్ట్ రీసెర్చ్ ఆడియెన్స్ కౌన్సిల్ (బార్క్)సీఈఓగా పని చేసిన పార్థ్‌దాస్ గుప్తాను 2020లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాతి కాలంలో ఆయన వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. దాదాపు 500 పేజీల చాట్ వివరాలు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో పాటు పీఎంఓను కూడా ఈ వ్యవహారంలోకి లాగిన అర్నాబ్ తాజాగా దేశ సైనిక రహస్యాలు వాట్సాప్‌లో వేరే వారికి పంపి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ చాట్‌లో సర్జికల్ స్ట్రైక్‌కి సంబంధించిన సమాచారం సర్జికల్ స్ట్రైక్స్ జరగడానికి మూడు రోజుల ముందు షేర్ అయిందన్న అనుమానాలు తలెత్తాయి.
2019 ఫిబ్రవరి 14న పుల్వామా డివిజన్ లెతిపోరా సమీపంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం యావత్తు ఆగ్రహంతో ఊగి పోయింది. పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలనే డిమాండ్ మొదలైంది. ఈ తరుణంలో మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. గతంలో 2016 సెప్టెంబరు 18న యూరీలో సైనిక శిబిరంపై ఉగ్ర దాడి అనంతరం తొలిసారిగా సర్జికల్ స్ట్రైక్ పేరుతో 2016లో ప్రతిదాడి జరిగింది. 2016 సెప్టెంబర్ 29న భారత్ చేసిన ఈ దాడిలో భారీ సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు మరణించారన్న వార్తలు వచ్చాయి. ఇక పుల్వామా ఘటన తరువాత 2019 ఫిబ్రవరి 26 రెండోసారి సర్జికల్ స్ట్రైక్ చేసింది. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడులు చేశాయి భారత్ సైనిక దళాలు. ఈ దాడుల్లోనే పొరపాటున వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పాకిస్తాన్‌కు చిక్కారు. తరువాత విడుదలయ్యారు.
ఎలా లీకైంది..?
దీనిలో ఎంతో పక్కా ప్రణాళిక, సమయస్ఫూర్తి, గోప్యత, నిఘా అవసరం. అందుకు పనిచేసే చాలా వ్యవస్థల సమన్వయంతో ఈ దాడి జరగాల్సి ఉంటుంది. అయితే, అలాంటి సమాచారం మూడు రోజుల ముందే అర్నాబ్ గోస్వామికి ఎలా తెలిసిందనేదే అసలైన ప్రశ్న. ఒక వేళ అర్నాబ్ గోస్వామికి తెలిసినా.. అలాంటి సమాచారాన్ని వేరే వాళ్లకి బహిర్గతం చేయడం ఏంటనేది మరో ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్రివిద దళాలు, కేంద్రంలోని ముఖ్యులు, రా, ఆపరేషన్ టీం హెడ్‌లకు మాత్రమే ఈ విషయం తెలిసే అవకాశం ఉంటుందని, ఈ ఆపరేషన్లో పాల్గొనే వారికి కూడా కొన్ని క్షణాల ముందు మాత్రమే సమాచారం వెళ్తుందని, మూడు రోజుల ముందు సమాచారం బయటకు రావడం అంటే.. తొలి దశలోనే లీకై ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు రాజకీయ వర్గాలే కారణం అనే సందేహాలు వస్తున్నాయి.
జెండా..అజెండా ఏంటి..
2017లో రిపబ్లిక్ టీవీ ఏర్పాటైన నాటి నుంచి ప్రతిపక్షాలపై విరుచుకుపడే వ్యక్తిగా అర్నాబ్ గోస్వామికి పేరుంది. సోనియగాంధీకి ఇటలీలో ఉన్న పేరుతో పిలిచి..కాంగ్రెస్ శ్రేణుల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో యూపీ సీఎంని అసలైన పేరుతో పిలిచినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఆ టీవీలో ప్రసారం చేయకపోవడాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించాయి. ప్రత్యక్షంగా సంబంధం ఉన్నా లేకున్నా.. ఆయన టీవీల్లో వస్తున్న వార్తలు, నేతలకు ఇస్తున్న ప్రియార్టీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రసారం అవుతున్నాయి.. బీజేపీయేతర రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రసారం అయ్యాయనే అంశాలపై చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో మహారాష్ట్ర పోలీసులు టీఆర్‌పీ కుంభకోణం బయటకు తీశారు. ఈ నేపథ్యంలో అర్నాబ్ గోస్వామి అరెస్టు అక్రమమని జర్నలిస్టుల కంటే ఎక్కువగా బీజేపీ శ్రేణులు నినదించాయి. మిగతా విషయాల్లో ఉన్న అనుమానాలు, ఆరోపణలు, సందేహాలు, అభిప్రాయాలు పక్కన బెడితే.. అర్నాబ్‌కి ఎవరు సపోర్టు చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరకుతుందనే చర్చ మొదలైంది.
విచారణ జరుపుతారా..?
ఇక టీఆర్‌పీ కుంభకోణంలో అరెస్టు కావడం, వాట్సాప్ సమాచారం బయటకు రావడం లాంటి పరిణామాల నేపథ్యంలో పార్థ్‌దాస్ గుప్తా ఆసుపత్రిలో చేరారు. అర్నాబ్ బెయిల్‌పై ఉన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అర్నాబ్‌కు సైనిక రహస్యాలు ఎలా లీకయ్యాయి.. అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదనే ప్రశ్న కాంగ్రెస్ తోపాటు ఇతర పక్షాల నుంచి రావడం సహజమే. ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఈ మేరకు ట్విట్ చేసి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ట్యాగ్ చేశారు. సైనిక రహస్యాలు బయటకు చెప్పడం వెనుక ఏం జరిగిందనేదికూడా విచారణ జరపాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. ఈ రహస్యాలు సరిహద్దు దాటి వేరే దేశాలకు చేరలేదని గ్యారెంటీ ఏంటనే ప్రశ్న కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేస్తారా అనే చర్చ సోషల్ మీడియలో నడుస్తోంది.











