విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇవాళ ఏపీలో చేపట్టిన బంద్‌కు అందరూ స్వచ్ఛందంగా సహకరించడంతో సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. బంద్‌కు అధికార పార్టీ కూడా మద్దతు పలకడంతో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ పాటించాయి. విశాఖ స్టీల్ సిటీలోనే కాకుండా 13 జిల్లాల్లోనూ బంద్ పాటించారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో పలు పార్టీల నేతలు నిరసనలు తెలిపారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. విశాఖ ఉక్కును రక్షిస్తాం’ అంటూ కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి.
విశాఖలో ..
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికసంఘాల పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. విద్యాసంస్థలు బంద్ పాటించాయి. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బస్సులు రోడ్డెక్కలేదు. డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపి బంద్‌కు మద్దతు ప్రకటించారు. లారీల యజమానులు, ప్రజా సంఘాలు మహిళా సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఉత్తరకోస్తాలోని మూడు జిల్లాల్లో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. జనజీవనం స్థంభించిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఏజన్సీ ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు స్వచ్ఛంధంగా బంద్ పాటించారు. నర్సీపట్నం, కాకినాడ,రాజమండ్రి,ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడల్లోనూ బంద్ పాటించారు. షాపులు మూసివేశారు. టీడీపీ, వామపక్షాల నేతలు పలు నగరాల్లోని కూడళ్లలో నిరసన తెలిపారు. కార్మిక సంఘాల యూనియన్లు విశాఖలో నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టారు.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు
స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తుండడంపై కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అధికార, విపక్షాలు. కార్మికసంఘాల నేతలతో జతకలిసి విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా ఆయా నగరాలు, పట్టణాల్లోని బస్టాండ్లు, కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బంద్ ఉదయం నుంచి ప్రశాంతంగా ముగిసింది. 22 కార్మిక సంఘాలతోపాటు, స్టీల్ ప్లాంటుకు భూములిచ్చిన రైతులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. విశాఖలో పలు కూడళ్లలో కార్మిక సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. విశాఖలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యనారాయణ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్ బంద్ లో పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగరాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. విజయవాడ ఆటోనగర్‌లో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎప్పుడూ కిటకిటలాడే బందరు రోడ్డు నిర్మానుష్యంగా మారింది.
సీమలోనూ ..
ఇక రాయలసీమలోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. చిత్తూరులో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని కార్మిక సంఘాల నాయకులు నినాదాలు చేశారు. రాయలసీమలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చిత్తూరు జిల్లాలోనే 1400 బస్సులు నిలిచిపోయాయి. బంద్ సందర్భంగా 13 జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.
Must Read ;- ప్రశాంత విశాఖలో వైసీపీ చిచ్చు. ఓటుతో బుద్ధిచెప్పాలన్న లోకేష్