( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఢిల్లీకి సెగ తాకేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులు నిర్ణయించారు. ఇప్పటివరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలకు పరిమితమైన విశాఖ ఉక్కు ఉద్యమం మరో రూపు దాల్చనుంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు వారాలకుపైగా చేపడుతున్న ఉద్యమం పట్ల కనీస స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి కానరావడం లేదు. దీంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అటు కార్మిక సంఘాలు, ఇటు వామపక్షాలు నిర్ణయించాయి. విశాఖ అఖిల పక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఈ మేరకు సమావేశమై భవిష్య కార్యాచరణ పై చర్చించింది. కేంద్రం కనీసం స్పందించకపోవడంపై ఆగ్రహించిన నాయకులు ఉద్యమ సెగ ఢిల్లీకి తాకేలా చేయాలని సభ్యులంతా అభిప్రాయపడ్డారు.
ఉద్యమాన్ని అవహేళన చేయడమే..
రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు హితబోధ చేయడంపై సమావేశం మండిపడింది. ఇది ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అవహేళన చేయడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా 7 వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించి అప్పులు తీర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది.
రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా, నిరసన కార్యక్రమాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ, గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మరోవైపు ట్రేడ్ యూనియన్లకు చెందిన నాయకులు ఈనెల 6వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపి మీ వెంట ఉన్నామంటూ పదే పదే ప్రకటనలు చేస్తోంది. సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్రను రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు నిర్వహించారు.
స్థానిక ఎన్నికలతో తగ్గిన ఉద్యమ తీవ్రత..
అయితే గత రెండు రోజులుగా విశాఖలో ఉద్యమ తీవ్రత తగ్గినట్టు కనిపించింది. భారీ కార్యక్రమాలకు వామపక్షాలు గాని, అధికార పక్షం గాని, ట్రేడ్ యూనియన్లు గాని పిలుపునివ్వకపోవడంతో ఉద్యమ వేడి తగ్గిందని పలు వర్గాలు భావించాయి. అయితే చాపకింద నీరులా… ఉద్యమం నానాటికి ఉదృతం అవుతుంది తప్ప.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అఖిల పక్షాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలన్నీ మునిగి తేలుతూ ఉండడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ఇరు పార్టీలకు స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో దృష్టంతా అటువైపు కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఎవరు ముందుకు వచ్చినా రాకున్నా.. ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. భారీ సంఖ్యలో కార్మికులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరింది.
జాతీయ రహదారి మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఈ కార్యక్రమాన్ని తలపెట్టనుంది. అదేవిధంగా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ ముఖద్వారం వద్ద ఈ నెల 12 నుంచి వందలాది మంది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై స్పందిస్తూ, రిలే దీక్షలకు నెల రోజులు అయిన సందర్భంగా మార్చి 12న జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సభ్యులు తీర్మానించారు. అనంతరం మార్చి 16న గాజువాకలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై రోడ్డు మ్యాప్ సిద్ధం చేయనున్నారు.
Must Read ;- వీరికి పోస్కోపై ఎందుకంత ప్రేమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!