ఓ నాయకుడి పాలన బాగుంది అంటే.. దాన్ని రామ రాజ్యంతో పోల్చుతాం. అదే.. పాలన బాగా లేకుంటే.. వీడి రాక్షస పాలన తట్టుకోలేకపోతున్నాం అంటూ నిందిస్తాం. ఇంతకీ.. రామ రాజ్యానికి, రాక్షస పాలనకు తేడా ఏంటి? రాక్షసులు అసమర్ధులా? వారికి పాలన చేతకాదా? అంటే.. రాక్షసులూ సమర్ధులే. అందుకు ఉదాహరణ.. రావణాసురుడు. ఆయనకు మంచి పరిపాలనా దక్షుడిగా పేరు. కానీ, రాక్షస పాలనలో ప్రజలు అగచాట్లు పడుతుంటారు. ఎందుకంటే.. రాక్షసులకు ప్రకృతి సహకరించదని మనం పురాణాల్లో చదువుకున్నాం. మనిషిలోని దుష్ట ఆలోచనలను ముందుగా ప్రకృతి పసిగట్టేస్తుంది అంటారు. అందుకే రాక్షస పాలనతో ఎప్పుడూ కరువు కాటకాలు, అతి వృష్టి, అనావృష్టితో జనం అల్లాడుతుండేవారు. నిత్యం ప్రమాదాలు, ప్రాణభయం మధ్య బతికేవారు. అదే రామ రాజ్యంలో.. రాముడికి ప్రకృతి అన్ని విధాలా సహకరించేది. ఆయన అడుగు పెట్టిన చోట సమృద్ధిగా వర్షాలు కురిసేవి. మోడువోయిన చెట్లు చిగురించేవి. పంటలు బాగా పండేవి. దీంతో.. ప్రజలు సకల సౌభాగ్యాలు, ధన ధాన్యాలతో తులతూగేవారు. అందుకే.. ఈ కాలంలో కూడా ఆ పదాలే వాడుకలో కొనసాగుతున్నాయి.
ప్రశాంతతకు మారుపేరు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఈ రాష్ట్రం ప్రశాంతతకు మారుపేరులా ఉండేది. ఓ రెండు మూడు జిల్లాల ఫ్యాక్షన్ ను మినహాయిస్తే.. రాష్ట్రమంతా ప్రశాంతంగానే ఉండేది. ఎప్పుడైనా ప్రభుత్వ తీరు నచ్చక ప్రజలు రోడ్డెక్కితే.. పాలకులు తమ తీరు మార్చుకునేవారు. కోర్టుల్ని గౌరవించేవారు. ప్రజా తీర్పును శిరసావహించేవారు. ఇలా నడుచుకుంటూనే.. నాటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు.. రాష్ట్రంపై తమదైన ముద్రవేశారు. మూస ధోరణిలో వెళుతున్న రాష్ట్రాన్ని.. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెడ్ల బండెక్కించి, జోరు పెంచారు ఎన్టీఆర్. ఆ తర్వాత చంద్రబాబు.. దానికి ఆధునిక సాంకేతిక సొబగులద్ది.. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లారు. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్.. హరితాంధ్రప్రదేశ్ నినాదంతో జలయజ్ఞం చేశారు. వైయస్సార్ హయాంలో కాస్త ఆందోళనలు, గొడవలు ఉన్నా.. అవి పార్టీ పరంగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఇద్దరూ.. వైఎస్ పాలనలోని లోపాలకు బాధ్యులుగా మిగిలారు.
ఆ తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం చంద్రబాబు.. అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచారు. రాజధాని భూ సమీకరణ లాంటి ఎన్ని పెద్దపెద్ద ప్రాజెక్టులు చేపట్టినా.. ఆందోళనలు, అశాంతి రేగకుండా చూసుకున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను అమాంతం పెంచేశారు. కష్టాలకు ఎదురొడ్డి నిలిచి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించారు. ఇక వేగంగా దూసుకుపోవాల్సిన స్థితిలో.. అనూహ్యంగా ఓటమి పాలై.. పదవిని కోల్పోయారు.
Must Read ;- నన్ను నమ్ముకో.. అన్నీ అమ్ముకో..: జగన్ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆగ్రహం
జగన్ జమానా మొదలైన వేళ..
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలు గడుస్తున్నాయ్. అంటే దాదాపు 640 రోజులు. ఇన్ని రోజుల్లో.. ఏ ఒక్క రోజైనా రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? అంటే.. లేదనే చెప్పొచ్చు. రోజూ హత్యలు, అశాంతి, భౌతికదాడులు, కక్ష సాధింపులు, వేధింపులు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, అలజడులు, కూల్చివేతలు, విధ్వంసాలు, అల్లర్లు, ధిక్కారాలు, రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు, వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు సర్వసాధారణమైపోయాయి. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టింది చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకే.. అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. అందుకే.. చంద్రబాబు కట్టించారన్న ఒకే ఒక్క కారణంతో.. పదవి చేపట్టిన నెల రోజుల్లోనే అక్రమ కట్టడం పేరుతో ప్రజా వేదికను కూల్చివేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను తీవ్రంగా వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇసుకతో మొదటి షాక్..
తొలి ఆరు నెలల్లోనే తానేంటో నిరూపించుకుంటానని చెప్పిన జగన్.. తన మాట నిలబెట్టుకునేందుకు నెల కూడా పట్టలేదు. చంద్రబాబు తెచ్చిన ఇసుక పాలసీపై పడ్డారు. అది అవినీతి మయమంటూ దాన్ని రద్దు చేసేశారు. సరే.. వెంటనే కొత్తపాలసీ తీసుకొచ్చారా.. అంటే.. అదీ లేదు. దీంతో.. రాష్ట్రంలో ఇసుక దొరక్క నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ ప్రభావం.. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణరంగంపై తీవ్రంగా పడింది. భవన నిర్మాణ కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. వారంతా పొట్టచేతబట్టుకుని రోడ్డెక్కి.. ఆందోళన బాటపట్టారు. ఇది జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా రేగిన తొలి ఆందోళన. అప్పటికి ఆయన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే అయింది. పనుల్లేక పదుల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా జగన్ సర్కారు కనికరించలేదు.
మూడుముక్కలాట..
ఆ తర్వాత ఆయన కన్ను రాజధానిపై పడింది. అప్పటికే అక్కడ 50 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతుండగా.. ఒక్క సంతకంతో అవన్నీ ఆపించేశారు. దాన్ని త్రిశంకంలోకి నెట్టేశారు. అప్పుడే రాజధాని రైతుల గుండెలు గుభేల్ మన్నాయి. అయినా.. వారిలో ఏదో ధైర్యం.. రాజధానిని మార్చే సాహసం చేయరులే అని. ఆ ధైర్యం కూడా ఆవిరై పోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఓ శుభ ముహూర్తాన.. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటకు తెరతీశారు. అంతే.. అమరావతి రైతుల గుండె పగిలింది. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులను నిలదీశారు. న్యాయ పోరాటానికి దిగారు. ధర్నాలు, నిసనలతో రాష్ట్రం హోరెత్తింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాతపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. లాఠీలు ఝలిపించింది. మహిళలు, చిన్నారులన్న కనికరం కూడా లేకుండా పోలీసులతో చితకబాదించింది. దీనిపై ఆగ్రహించిన టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు రైతులకు సంఘీభావం ప్రకటించాయి. నాటి నుంచి నేటి వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయినా.. ప్రభుత్వం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. పైగా.. ఆ రైతులను పెయిడ్ ఆర్టిస్టులని, చంద్రబాబు తొత్తులని.. వారికి కులాన్ని అంటగట్టి దూషిస్తోంది.
Also Read ;- నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన
భౌతిక దాడులు..
జగన్ గద్దెనెక్కన తర్వాత.. దళితులపై దాడులు పెట్రేగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై భౌతికదాడులకు దిగడం, వారికి గుండ్లు చేయించడం లాంటి దాష్టీకాలు నిత్యకృత్యాలైపోయాయి. వైద్యులకు మాస్కులు, పీపీఈ కిట్లు కావాలన్నందుకు డాక్టర్ సుధాకర్ ను ఈ ప్రభుత్వం ఎంతలా హింసించిందో తెలిసిందే. నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి మరీ రౌడీలతో చితకబాదించింది. అతడిపై పిచ్చోడని ముద్ర వేసింది. రకరకాల కేసులు బనాయించి జైల్లో పెట్టించింది. ఈ ఘటనపై కోర్టులు ఆగ్రహించినా పట్టించుకోలేదు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని తీవ్రంగా వేధింపులకు గురిచేసింది. దీంతో.. అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చిత్తూరులో మాజీ జడ్జి రామకృష్ణపై వేధింపులకు దిగారు. ఆయన కుటుంబాన్ని రోడ్డుకీడ్చారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జిలను సైతం ఆయన వేధింపులకు గురిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ.. సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. అప్పటి హైకోర్టు జడ్జి రాకేశ్ కుమార్.. ప్రభుత్వ వ్యతిరేకమైన కేసుల విచారణ తనవల్ల కాదంటూ తప్పుకోవడం సంచలనమైంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ప్రభుత్వ వేదింపులు ఏ స్థాయిలో ఉంటున్నాయో.
ఆలయాలపై దాడులు
ఈ ఆందోళనలన్నీ ఒక ఎత్తయితే.. హిందూ ఆలయాలపై జరిగిన విద్వేష దాడులు మరో ఎత్తు. మూడు నెలల వ్యవధిలో దాదాపు 300కు పైగా ఆలయాలపై దాడులు జరిగాయి. దేవతల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో ఓ పార్టీ బలపడేందుకే ఈ దాడులు జరిగాయని, అందుకు అధికార వైసీపీ సహకారముందని ఓ వర్గం విశ్లేషిస్తోంది. ఏది ఏమైనా.. ఈ అమానుష దాడులతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఇక్కడ ప్రజలు సంయమనంతో ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ.. లేకుంటే రాష్ట్రం తగలబడిపోయేది. ఇక్కడ కచ్చితంగా ఏపీ ప్రజలను అభినందించి తీరాల్సిందే. వారు తమ సంయమనంతో కుట్రదారుల ఆటలు సాగనివ్వలేదు.
ఎన్నికల సంఘంతో ఆటలు
రాష్ట్రంలో ఎస్ఈసీని ఓ ఆట ఆడించింది జగన్ ప్రభుత్వం. కరోనా వల్ల 2020లో స్థానిక ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డను వయోపరిమితి తగ్గించడం ద్వారా పదవి నుంచి తప్పించింది. దీనికి లొంగని నిమ్మగడ్డ.. సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ.. తన పదవిని దక్కించుకున్నారు. దీంతో.. ఆయనపై కక్ష పెంచుకున్న ప్రభుత్వం.. అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా.. జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. పట్టుబట్టి, కోర్టుకెళ్లి మరీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Also Read ;- జగన్‌కు పోస్కోకు విజయసాయిరెడ్డే మధ్యవర్తి.. ఆధారాలు ఉన్నాయన్న అయ్యన్నపాత్రుడు
వలంటీర్ల ఆందోళనలు
తాను ఏరి కోరి నియమించుకున్న వలంటీర్లే ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. 5 వేలు జీతం.. అదీ ఎప్పుడిస్తారో కూడా తెలియని స్థితి. ఇలాంటి స్థితిలో వలంటీర్లు రోడ్డెక్కారు. తమకు వెంటనే జీతాలు పెంచాలంటూ నినదించారు. కానీ, యథాప్రకారం.. జగన్.. వీరి డిమాండ్లను కొట్టి పారేశారు. మీరు వలంటీర్లు, మీకిచ్చేది గౌరవ వేతనం, మీరు చేసేది సేవ మాత్రమే.. ఉద్యోగం కాదు అంటూ తేల్చిపారేశారు. కావాలంటే సన్మానం చేస్తాం గానీ జీతం మాత్రం పెంచబోమంటూ కుండబద్దలు కొట్టేశారు. దీంతో.. వలంటీర్లకు చిర్రెత్తుకొచ్చింది. ప్రభుత్వం దిగొచ్చేవరకు సహకరించబోమంటూ తేల్చిచెప్పారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
విశాఖ ఉక్కుతో పతాకస్థాయికి..
జగన్ ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. కేంద్రం ఇంత ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందంటే.. దీని వెనుక వైసీపీ పెద్ధల హామీ ఉందనేది అందరి అనుమానం. కాదు కాదు ఇది నిజమేనంటున్నారు మరికొందరు. పోస్కో కంపెనీ ఉక్కుపరిశ్రమ స్థాపించేందుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా భూమి ఇవ్వకపోవడంతో.. ఆ సంస్థను విజయసాయి రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఆ సంస్థకు అప్పనంగా విశాఖ ఉక్కును అప్పగించేసేందుకు సిద్ధపడిపోయారు. ఏడాది క్రితమే పోస్కో ప్రతినిధులను విజయసాయిరెడ్డి.. జగన్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి పథక రచన చేసి.. నేటికి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. చేయాల్సిన నష్టమంతా చేసేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగనట్లు సీఎం జగన్.. ప్రధానికి లేఖ రాస్తారు.. ఏ2 ఎంపీ విజయసాయి.. పాదయాత్ర చేస్తానంటారు. ఓ క్రిమినల్.. రాష్ట్రాధినేత అయితే.. ఆ రాష్ట్రం పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నారు జగన్. ఎంతో మంది బలిదానంతో.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఏర్పడ్డ విశాఖ ఉక్కు పరిశ్రమ.. ఓ దుర్మార్గ పాలకుడి స్వార్ధానికి బలై.. ప్రైవేటు పరం కావడానికి సిద్ధంగా ఉంది.
తిరగబడుతున్న ప్రకృతి!
రాష్ట్రంలో జగన్.. అధికార పీఠం అధిరోహించిప్పటి నుంచీ రాష్ట్రంలో ఒకటి తర్వాత ఒకటిగా ప్రాకృతిక విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి. తీవ్రమైన తుఫాన్ల దెబ్బకు రాష్ట్రం చిగురుటాకులా వణికింది. ఎప్పుడూ లేనంతగా ఈ 20 నెలల్లో దాదాపు ఏడు తుఫాన్లు రాష్ట్రాన్ని కుదిపేశాయి. కనీవినీ ఎరుగని నష్టానికి గురిచేశాయి. విశాఖను రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రశాంతమైన ఆ నగరంలో అలజడులు మొదలయ్యాయి. ఎన్నడూ లేనట్లు విషవాయువులు లీకై పదుల సంఖ్యలో అమాయకులు మృత్యువాత పడ్డారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో జనం విలవిల్లాడిపోయారు. పిట్టల్లా రాలిపోయారు. అయినా.. ఇప్పటివరకూ అందుకు కారణాన్ని ఈ ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది. ఆ సమస్య.. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది.
ప్రజలిచ్చిన అధికారానికి వాళ్లే బలి..
రాష్ట్రంలో నేడు ఎన్నడూ లేని విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వంలో జవాబుదారీ తనం లేకపోవడం, నాయకుల్లో విచ్చలవిడితనం పెరిగిపోవడం, ప్రభుత్వాధినేతల్లో ప్రజలంటే చులకన భావం ఏర్పడడం వీటికి ప్రధాన కారణాలు. తప్పు చేస్తే ప్రజలు నిలదీస్తారన్న భయం పాలకుల్లో ఉంటే.. వారు అదుపులో ఉంటారు. ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపితే.. తమ కేమన్నా జరుగుతుందేమో అనే భయం ప్రజల్లో ఉంటే.. ఇక ప్రభుత్వ అరాచకాలకు హద్దుండదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే పరిస్తితి నెలకొని ఉంది. ఏదో ఒక పథకం పేరుతో.. జనానికి ఎంతో కొంత పడేస్తే చాలు.. తమ ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చు అనే భావన ఈ ప్రభుత్వంలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ భావన మరింత ముదరక ముందే ప్రజలు కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. ప్రజలంటే లెక్కలేని ఈ ప్రభుత్వానికి.. ఏదో ఒక రోజు ఆ ప్రజలే బలికాక తప్పదు.
Also Read ;- వీరికి పోస్కోపై ఎందుకంత ప్రేమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!