ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 26 నుంచి 30 వరకు అంటే 5 రోజులపాటు సింగపూర్‌లో చంద్రబాబు అండ్ టీం పర్యటించనుంది. ఈ బృందంలో 8 మంది సభ్యులు ఉన్నారు. మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఐదుగురు సీనియర్ అధికారులు చంద్రబాబు వెంట సింగపూర్‌కు వెళ్లనున్నారు. సింగపూర్ పెట్టుబడిదారులతో విస్తృతంగా చర్చలు జరపనున్నారు. పట్టణ ప్రణాళిక, నగర సుందరీకరణ, గార్డెనింగ్, ఓడరేవులు, ఇతర లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతికత వంటి రంగాల్లో ఆ దేశ సహకారం తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై అక్కడి రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార ప్రతినిధులతో ఈ బృందం సంప్రదింపులు జరుపుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ పర్యటనలో ప్రధానంగా అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేయనున్నారని తెలుస్తోంది. అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చింది సింగపూర్ బృందమే. సీడ్ క్యాపిటల్‌ను సింగపూర్ ప్రభుత్వ సాయంతో అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కార్ గతంలో భావించింది. ఐతే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ..ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. దాంతో సింగపూర్ ఇలాంటి నాన్ సీరియస్ ప్రాజెక్టుల్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది.
ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ..మరోసారి సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఇలా ఉంటే..మళ్లీ ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్లీ రద్దు చేస్తారని..ఇలాంటి ఒప్పందాలతో టైం వేస్ట్ చేసుకోలేమని తేల్చేశారు. మంత్రి నారాయణ ఒకటి రెండు సార్లు సింగపూర్ బృందంతో సంప్రదింపులు జరిపినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దాంతో చంద్రబాబు నేరుగా సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.











